ఆ 14 మందితో ప‌వ‌న్ కొత్త ఆట‌.. వైసీపీ ఖాళీ అవ్వ‌డం ఖాయ‌మా?

admin
Published by Admin — June 16, 2026 in Politics, Andhra, Telangana
News Image

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జనసేనాని, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్(Pawan Kalyan) మరో సంచలన వ్యూహానికి తెరలేపారు. ఎన్నికల్లో సాధించిన చారిత్రాత్మక విజయంతో సరిపెట్టుకోకుండా, రాబోయే రోజుల్లో పార్టీని క్షేత్రస్థాయిలో తిరుగులేని శక్తిగా మార్చేందుకు ఆయన ‘ఆపరేషన్ ఆకర్ష్‌’ను అధికారికంగా ప్రారంభించారు. ఇందులో భాగంగానే 14 మంది అత్యంత సీనియర్ నేతలతో కూడిన హై-ప్రొఫైల్ ‘జాయినింగ్స్ కమిటీ’ని ప్రకటించి ఏపీ రాజకీయాల్లో ఒక్కసారిగా హీట్ పెంచేశారు.

ఈ కమిటీలో చోటు దక్కించుకున్న నాయకుల లిస్ట్ చూస్తుంటేనే పవన్ కల్యాణ్ ఎంత పక్కా స్కెచ్‌తో ముందుకు వెళ్తున్నారో అర్థమవుతోంది. అసెంబ్లీలో జనసేన గొంతుకలుగా మారిన బొలిశెట్టి శ్రీనివాస్, వంశీకృష్ణ శ్రీనివాస్, పంతం నానాజీ వంటి ఎమ్మెల్యేలు, ఎంపీ లింగమనేని రమేష్‌లతో పాటు.. ఇటీవలే పార్టీలో చేరిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి(Balineni Srinivasa Reddy), మాజీ ఎమ్మెల్యేలు కిలారి రోశయ్య, సామినేని ఉదయభాను వంటి ఉద్దండులకు ఇందులో పెద్దపీట వేశారు. వీరితో పాటు కొటికలపూడి చినబాబు, డాక్టర్ హరిప్రసాద్ వంటి సీనియర్ వ్యూహకర్తలను రంగంలోకి దించడం ద్వారా చేరికల ప్రక్రియను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు స్పష్టమవుతోంది.

ప్రస్తుతం ఏపీ పొలిటికల్ సర్కిల్స్‌లో వినిపిస్తున్న ప్రధాన చర్చ.. వైసీపీ(YCP) పూర్తిగా ఖాళీ అవ్వడం ఖాయమేనా? అని. జగన్ వైఖరి నచ్చక, పార్టీలో భవిష్యత్తు కనిపించక బయటకు వచ్చేందుకు గోడ దూకడానికి సిద్ధంగా ఉన్న వైసీపీ హేమాహేమీలకు ఈ 14 మంది కమిటీ ఒక రెడ్ కార్పెట్ లాంటి వేదిక కానుంది. కేవలం రాజకీయ నాయకులే కాకుండా.. సమాజంలోని విద్యావంతులు, వివిధ రంగాల ప్రముఖులు, సామాజికవేత్తలను కూడా గౌరవప్రదంగా పార్టీలోకి ఆహ్వానించి తగిన ప్రాధాన్యత కల్పించడమే ఈ కమిటీ ప్రధాన టాస్క్.

ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న పవన్ కల్యాణ్.. అది ముగిసిన వెంటనే అమరావతిలో ఈ 14 మంది కమిటీ సభ్యులతో ప్రత్యేకంగా భేటీ కానున్నారు. ఎవరెవరిని చేర్చుకోవాలి? ఎవరికి ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వాలి? అనే అంశాలపై క్షేత్రస్థాయి దిశానిర్దేశం చేయనున్నారు. ఇక పవన్ కల్యాణ్ వ్యూహాలు కేవలం ఆంధ్రప్రదేశ్‌కే పరిమితం కావడం లేదు. పొరుగు రాష్ట్రమైన తెలంగాణలోనూ జనసేన(Janasena) జెండాను బలంగా పాతేందుకు ఆయన రూట్ మ్యాప్ సిద్ధం చేశారు. ఏపీ తరహాలోనే తెలంగాణలోనూ త్వరలోనే ఒక ప్రత్యేక జాయినింగ్స్ కమిటీని ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. మొత్తానికి, పవన్ కల్యాణ్ వేసిన ఈ 14 మంది సభ్యుల మాస్టర్ ప్లాన్ ప్రత్యర్థి పార్టీల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. మ‌రి రాబోయే రోజుల్లో ఏపీ, తెలంగాణ రాజకీయాల్లో ఈ చేరికల కమిటీ ఎలాంటి పెను సంచలనాలకు దారితీస్తుందో చూడాలి.

Tags
Pawan Kalyan JanaSena Party JanaSena Andhra Pradesh AP Politics JSP Joining Committee Telangana
Recent Comments
Leave a Comment

Related News