గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో తనదైన శైలిలో ఘాటు వ్యాఖ్యలు, బూతు పురాణాలతో నిత్యం వార్తల్లో నిలిచిన మాజీ మంత్రి, వైసీపీ(YCP) ఫైర్‌బ్రాండ్ కొడాలి నానికి బ్యాడ్ టైమ్ స్టార్ట్ అయిందా? అంటే అవును అన్న సమాధనమే విపిపిస్తోంది. నాడు ప్రతిపక్ష నేతలపై, రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్నవారిపై కొడాలి నాని చేసిన వ్యాఖ్యలను సీరియస్‌గా తీసుకున్న ప్రస్తుత కూటమి ప్రభుత్వం.. ఆయనపై చట్టపరమైన చర్యలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
వైసీపీ అధికారంలో ఉన్న 2021 ఫిబ్రవరి కాలమది. రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల వేడి నడుస్తోంది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పటికీ, నాటి పౌరసరఫరాల శాఖ మంత్రిగా ఉన్న కొడాలి నాని పరిధులు దాటి మాట్లాడారు. అప్పటి ప్రధాన ప్రతిపక్ష నేతని ఉద్దేశించి.."చంద్రబాబు(Chandrababu)ను మెడపట్టి ఈ రాష్ట్రం నుంచి వెళ్లగొట్టాలి" అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేయడమే కాకుండా.. ఏకంగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌పైనే వ్యక్తిగత దూషణలకు దిగారు. ఎన్నికల నిబంధనలను బేఖాతరు చేస్తూ సాగిన కొడాలి నాని ప్రెస్ మీట్‌పై అప్పట్లోనే ఎస్‌ఈసీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై విచారణ జరపాల్సిందిగా కృష్ణా జిల్లా ఎస్పీకి ఆదేశాలు వెళ్లడంతో.. గుడివాడ పోలీసులు న్యాయస్థానం అనుమతితో 2021 ఫిబ్రవరి 16న కొడాలి నానిపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు.
నిబంధనల ప్రకారం అధికారంలో ఉన్న ప్రజాప్రతినిధులపై నమోదైన క్రిమినల్ కేసుల్లో పోలీసులు ఛార్జ్‌షీట్ దాఖలు చేయాలన్నా, కోర్టు విచారణ ప్రారంభించాలన్నా ప్రభుత్వ అనుమతి తప్పనిసరి. అయితే, గత ఐదేళ్లూ వైఎస్ జగన్(YS Jagan) ప్రభుత్వం అధికారంలో ఉండటంతో కొడాలి నానిని కాపాడుకుంటూ ఆ ఫైల్‌ను కోల్డ్ స్టోరేజ్‌లో పెట్టేశారు. అయితే ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పాత కేసుల దుమ్ము దులిపింది. ఈ క్రమంలోనే కొడాలి నాని కేసు ఫైల్ హోంశాఖ ముందుకు వచ్చింది.
కృష్ణా జిల్లా కలెక్టర్ పంపిన నివేదికను క్షుణ్ణంగా పరిశీలించిన హోంశాఖ.. కొడాలి నానిపై క్రిమినల్ విచారణ జరపడానికి సరిపడా ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని తేల్చింది. దీంతో ఆయనపై కోర్టులో ప్రాసిక్యూషన్ ప్రక్రియను ప్రారంభించేందుకు అనుమతినిస్తూ హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా, నాడు అధికార మదంతో మాట్లాడిన మాటలకు.. నేడు కోర్టు బోనులో నిలబడాల్సిన పరిస్థితి రావడంతో కొడాలి నాని(Kodali Nani)కి బిగ్ షాక్ తగిలినట్లు అయింది.