ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) అధికార పార్టీ తెలుగుదేశంలో ముసలం మొదలైందా..? పార్టీ అధినేత, సీఎం నారా చంద్రబాబు నాయుడు క్షేత్రస్థాయి ప్రక్షాళనకు నడుం బిగించారా..? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. ఇటీవలే రాష్ట్ర, జాతీయ కమిటీలను ప్రకటించినప్పటికీ.. మళ్లీ అంతలోనే అంతర్గత నివేదికల ఆధారంగా ఆపరేషన్ క్లీన్ కు బాబు సిద్ధమవడం తమ్ముళ్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది
గత కొన్ని నెలలుగా నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యేల పనితీరుపై చంద్రబాబు(Chandrababu) రహస్య సర్వేలు చేయించినట్లు తెలుస్తోంది. ఈ సర్వేల్లో కొందరు ప్రజాప్రతినిధుల గ్రాఫ్ దారుణంగా పడిపోయిందని టాక్. నిరంతరం ప్రజల్లో ఉంటూ, ప్రభుత్వ సంక్షేమ పథకాలను జనాల్లోకి తీసుకెళ్లడంలో సదరు నేతలు పూర్తిగా విఫలమయ్యారనే టాక్ వినిపిస్తోంది. కేవలం అధికార దర్పం ప్రదర్శిస్తూ, స్థానిక క్యాడర్‌ను పట్టించుకోని వారిపై బాబు తీవ్ర అసంతృప్తితో ఉన్నారట.
మరీ ముఖ్యంగా.. నియోజకవర్గాల్లో జరుగుతున్న కొన్ని సివిల్ వివాదాలు, స్థానిక కాంట్రాక్టులు, ఇతరత్రా దందాల్లో కొందరు టీడీపీ(TDP) లీడర్ల హస్తం ఉందంటూ అధిష్టానానికి పక్కా రిపోర్ట్స్ వెళ్లినట్లు సమాచారం. "ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేలా ఎవరు వ్యవహరించినా సహించేది లేదు" అని గతంలోనే హెచ్చరించిన చంద్రబాబు.. ఇప్పుడు ఆ నివేదికల ఆధారంగా యాక్షన్‌కు దిగుతున్నట్లు తెలుస్తోంది. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని, ప్రజల్లో వ్యతిరేకత తెచ్చుకున్న వారిని నిర్ధాక్షిణ్యంగా పక్కన పెట్టేందుకు స్క్రిప్ట్ సిద్ధమైందని పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
ఈ ప్రక్షాళన ప్రభావం త్వరలో జరగబోయే మంత్రివర్గ విస్తరణపై కూడా గట్టిగానే పడనుంది. కేబినెట్‌లో ఉంటూ ఆశించిన స్థాయిలో యాక్టివ్‌గా లేని మంత్రులకు ఉద్వాసన పలికి.. విపక్షాల విమర్శలను సమర్థవంతంగా తిప్పికొట్టే ఫైర్ బ్రాండ్లకు అవకాశం ఇవ్వాలని బాబు భావిస్తున్నారు. పార్టీ లైన్ దాటినా, పర్ఫార్మెన్స్ తగ్గినా ఎంతటి సీనియర్ అయినా వేటు తప్పదనే సంకేతాలు వస్తుండటంతో.. ఇప్పుడు టీడీపీ(TDP)లోని సదరు లీడర్లు తమ సీట్లు కాపాడుకునేందుకు ముమ్మర ప్రయత్నాలు మొదలుపెట్టారు.