కేశినేని బ్ర‌ద‌ర్స్ వార్‌.. రేవంత్ వ‌ద్ద‌కు పంచాయితీ..!

admin
Published by Admin — June 28, 2026 in Politics, Andhra, Telangana
News Image

తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో విజయవాడ 'కేశినేని' బ్రదర్స్ వివాదం మరోసారి పీక్స్‌కు చేరింది. నిన్నటివరకు కేవలం బెజవాడ పాలిటిక్స్‌కే పరిమితమైన అన్నదమ్ముల సవాల్, ఇప్పుడు ఏకంగా హైదరాబాద్ వేదికగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వద్దకు చేరింది. ప్రస్తుత విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) టార్గెట్‌గా ఆయన సొంత అన్న, మాజీ ఎంపీ కేశినేని నాని(Kesineni Nani) విసిరిన భూబాణం ఇప్పుడు ఇరు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టిస్తోంది. తెలంగాణ రాజధాని నగర శివార్లలోని వేల కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూమిని కబ్జా చేసేందుకు తన తమ్ముడు చిన్ని ప్రయత్నిస్తున్నారంటూ నాని నేరుగా సీఎం రేవంత్‌కే లేఖ రాయడం పొలిటికల్ సర్కిల్స్‌ను షేక్ చేస్తోంది.

హైదరాబాద్‌లోని ప్రగతి నగర్, షంషిగూడ పరిధిలో తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (టీజీఐఐసీ)కి చెందిన 112.72 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఐటీ పార్క్ కోసం కేటాయించిన ఈ సెక్టార్‌పై కొంతకాలంగా ల్యాండ్ మాఫియా కన్ను పడిందనేది తాజా ఆరోపణ. అయితే, ఈ వ్యవహారంలో ఎంపీ కేశినేని చిన్ని, ఆయనకు బినామీగా ఉన్న ‘మెసర్స్ ఎక్సెల్లా ప్రాపర్టీస్’ అనే సంస్థ కీలకంగా వ్యవహరిస్తున్నాయని కేశినేని నాని బాంబు పేల్చారు. ఇప్పటికే ఈ భూమిపై ఈడీ (ED) జప్తు ఆర్డర్లు, నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (NCLT) ఆంక్షలు అమల్లో ఉన్నప్పటికీ.. వాటన్నింటినీ తొక్కిపెట్టి మోసపూరితంగా ఆక్రమించుకునేందుకు ప్రయత్నిస్తున్నారన్నది నాని ఆరోపణల సారాంశం.

కలెక్టర్ ఇచ్చిన అఫిడవిట్ ప్రకారం సదరు వివాదాస్పద భూమిలో ప్రైవేట్ వ్యక్తులకు ఎలాంటి హక్కులు లేవని (జీరో ప్రైవేట్ టైటిల్) స్పష్టంగా ఉందని నాని గుర్తుచేశారు. కానీ, కోర్టులను పక్కదోవ పట్టిస్తూ.. సుప్రీంకోర్టు(Supreme Court)లో ఒక ఫేక్ రాజీ ఒప్పందాన్ని సృష్టించి, రాత్రికి రాత్రే అక్కడ అక్రమ నిర్మాణాలు సైతం మొదలుపెట్టారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆస్తులను లూటీ చేసేందుకు ఇంతటి సాహసానికి ఒడిగట్టిన వారి వెనుక ఉన్న శక్తులెవరో తేలాల్సి ఉందంటూ తెలంగాణ ప్రభుత్వానికి రాసిన లేఖలో నాని నిలదీశారు.

ఇక ఈ ల్యాండ్ స్కామ్‌ను అడ్డుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం వెంటనే లీగల్ యాక్షన్ తీసుకోవాలని కేశినేని నాని విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా అక్రమ కట్టడాలపై ఉక్కుపాదం మోపుతున్న 'హైడ్రా' (HYDRAA) యంత్రాంగాన్ని ఈ వ్యవహారంలో రంగంలోకి దించాలని కోరడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. తక్షణమే అక్కడ జరుగుతున్న నిర్మాణాలను కూల్చేసి, టీడీపీ ఎంపీ కేశినేని చిన్ని(Kesineni Chinni)తో పాటు ఆయన బినామీలపై ఎఫ్‌ఐఆర్  నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఏపీకి చెందిన అధికార పార్టీ ఎంపీపై, పక్క రాష్ట్ర మాజీ ఎంపీ చేసిన ఈ ల్యాండ్ కంప్లైంట్ ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) కోర్టులో ఉంది. మరి ఈ బెజవాడ బ్రదర్స్ పంచాయితీపై తెలంగాణ సీఎం ఎలా స్పందిస్తారో.. 'హైడ్రా' యాక్షన్ ఉంటుందో లేదో చూడాలి.

Tags
Kesineni Brothers Kesineni Nani Kesineni Chinni Hyderabad Land Scam HYDRAA CM Revanth Reddy AP Politics
Recent Comments
Leave a Comment

Related News