2026లో సగం గడిచిపోయింది. చూస్తుండగానే జూన్ వరకు వచ్చేశాం. మరి ఇప్పటిదాకా వచ్చిన సినిమాల్లో బిగ్గెస్ట్ హిట్ ఏదో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే. కలెక్షన్ల పరంగా చూస్తే పెద్దినే హైయెస్ట్ గ్రాసర్. ఆ చిత్రం నిర్మాతల లెక్కల ప్రకారం రూ.450 కోట్ల దాకా కలెక్ట్ చేసింది. కానీ అందులో వంద కోట్లయినా తగ్గించుకోవాల్సిందే. కలెక్షన్లు ఎంత అన్నది పక్కన పెడితే ఈ చిత్రం హిట్ స్టేటస్ అందుకోలేకపోయింది.
తెలుగు రాష్ట్రాల వరకు సినిమా బ్రేక్ ఈవెన్ అయినా.. మిగతా రాష్ట్రాలు, నార్త్ అమెరికాలో సినిమా డిజాస్టర్ అయింది. కాబట్టి ఓవరాల్‌గా హిట్ స్టేటస్ అందుకోలేకపోయింది. రూ.300 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించడమే కాక.. ఇటు నిర్మాతలు, అటు బయ్యర్లకు భారీ లాభాలు అందించిన మెగాస్టార్ చిరంజీవి సినిమా మన శంకర వరప్రసాద్ గారు రీజనల్ ఇండస్ట్రీ హిట్ అయింది. కొన్ని రోజుల ముందు వరకు చిరు సినిమానే ఈ ఏడాదికి అతి పెద్ద బ్లాక్ బస్టర్.
కానీ పెట్టుబడి, రాబడి కోణంలో చూస్తే మన శంకర వరప్రసాద్ గారునే బిగ్గెస్ట్ హిట్‌గా చెప్పలేం. రెండు వారాల కిందట రిలీజైన సమంత సినిమా మా ఇంటి బంగారంనే ఈ ఏడాది అతి పెద్ద బ్లాక్ బస్టర్‌గా చెప్పాలి. రూ.15 కోట్ల బడ్జెట్లో తెరకెక్కిన సినిమా ఇది. సమంత సొంత ప్రొడక్షన్ కావడంతో రెమ్యూనరేషన్ తీసుకోలేదు. ఆ బడ్జెట్ ప్రొడక్షన్, మిగతా రెమ్యూనరేషన్ల కోసం వెచ్చించారు. ఈ మొత్తం నాన్ థియేట్రికల్ హక్కులతోనే రాబట్టేసింది మా ఇంటి బంగారం. థియేటర్ల నుంచి వచ్చేదంతా లాభమే.
కొన్ని ఏరియాలను అమ్మి, చాలా వరకు సొంతంగా రిలీజ్ చేసుకోగా.. ఈ చిత్రం ఇప్పటిదాకా రూ.65 కోట్లకు పైగానే గ్రాస్ కలెక్ట్ చేసింది. ఫుల్ రన్లో 80 కోట్ల మార్కును దాటొచ్చు. ఇందులో షేర్ సగం వేసుకున్నా.. సమంత, రాజ్, హిమాంక్‌లకు రూ.40 కోట్లకు తక్కువ కాకుండా లాభం అన్నమాట. నాన్ థియేట్రికల్స్ నుంచి వచ్చింది కూడా కలిపితే పెట్టుబడి మీద నాలుగు రెట్ల దాకా ఆదాయం, దాదాపు మూడు రెట్ల లాభం అంటే దీన్ని ట్రిపుల్ బ్లాక్ బస్టర్ అనాల్సి ఉంటుంది. కాబట్టి ఈ ఏడాది ఇప్పటిదాకా బిగ్గెస్ట్ హిట్ సమంత సినిమానే.