మోదీ లిస్ట్‌లో బండి.. సేఫా? అవుటా?

admin
Published by Admin — June 28, 2026 in Politics, Telangana, National
News Image

కేంద్ర మంత్రివర్గంలో త్వరలోనే భారీ మార్పులు చోటుచేసుకోబోతున్నాయనే వార్తలు దేశ రాజధాని ఢిల్లీ నుంచి గల్లీ దాకా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన విదేశీ పర్యటన ముగించుకుని రాగానే, కేంద్ర క్యాబినెట్ ప్రక్షాళనకు ముహూర్తం ఖరారైనట్లు రాజకీయ వర్గాల్లో గట్టి ప్రచారం సాగుతోంది. ఈ క్రమంలోనే ప్రధాని మోదీ(PM Modi) ఇటీవల రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసి, మంత్రుల తుది జాబితాను కూడా అందజేశారనే లీకులు రావడంతో అందరి కళ్లూ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల మంత్రులపైనే పడ్డాయి. ముఖ్యంగా తెలంగాణ ఫైర్ బ్రాండ్, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పదవిపై వస్తున్న రూమర్లకు ఈ ప్రక్షాళనతో తెరపడనుందా లేదా అనే ఉత్కంఠ నెలకొంది.

గత కొద్ది రోజులుగా బండి సంజయ్(Bandi Sanjay) వ్యక్తిగత, కుటుంబ వ్యవహారాలకు సంబంధించిన కొన్ని వివాదాలు తెరపైకి రావడంతో, ఆయనను మంత్రి పదవి నుంచి తప్పిస్తారనే ప్రచారం జోరుగా సాగింది. ప్రత్యర్థులు కూడా దీన్ని పెద్ద ఎత్తున అస్త్రంగా మార్చుకున్నారు. అయితే, తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం బండి సంజయ్ కుర్చీకి ఎలాంటి ఢోకా లేదని తెలుస్తోంది. తెలంగాణలో భారతీయ జనతా పార్టీ బలోపేతానికి ఆయన చేసిన పోరాటాలు, పార్టీ పట్ల ఆయనకున్న నిబద్ధతను అధిష్టానం గుర్తించిందని.. వ్యక్తిగత వివాదాలను పార్టీకి ముడిపెట్టే ప్రసక్తే లేదని బీజేపీ పెద్దలు స్పష్టం చేస్తున్నారు. దీంతో బండి సంజయ్ స్థానం పూర్తిగా సురక్షితమేనని, ఆయన పీఠం కదిలే ఛాన్స్ లేదని టాక్ నడుస్తోంది.

అయితే, బండి సంజయ్ పదవి సేఫ్ అయినప్పటికీ.. తెలుగు రాష్ట్రాలకు చెందిన మిగిలిన నలుగురు కేంద్ర మంత్రుల శాఖల్లో మాత్రం మోదీ మార్పులు చేయబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పౌర విమానయాన శాఖ చూస్తున్న కింజరాపు రామ్మోహన్ నాయుడు(Kinjarapu Ram Mohan Naidu)ను పర్యాటక శాఖకు, గనుల శాఖ మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డిని పట్టణాభివృద్ధి శాఖకు మార్చే యోచనలో అధిష్టానం ఉన్నట్లు సమాచారం. అలాగే ఏపీకి చెందిన కేంద్ర సహాయ మంత్రులు పెమ్మసాని చంద్రశేఖర్, శ్రీనివాస వర్మల శాఖలు కూడా మారనున్నాయని, పెమ్మసానికి హోం శాఖ పరిధిలోకి తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయని ఢిల్లీ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. మొత్తానికి ఎవరినీ క్యాబినెట్ నుంచి తొలగించకపోయినా.. ఈ నెల 30 కల్లా జరగబోయే ఈ మార్పుల చేర్పుల వ్యవహారం పొలిటికల్ సర్కిల్స్‌లో తీవ్ర ఆసక్తిని రేపుతోంది.

Tags
Modi Cabinet Narendra Modi Bandi Sanjay Delhi Politics BJP
Recent Comments
Leave a Comment

Related News