మహారాష్ట్ర(Maharashtra)లోని పూణే జిల్లాలో జరిగిన ఒక అత్యంత అమానుష ఘటనలో న్యాయవ్యవస్థ చరిత్ర సృష్టించింది. దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన మూడేళ్ల పసికందు అత్యాచారం, హత్య కేసులో స్పెషల్ కోర్టు రికార్డు సమయంలో విచారణ పూర్తి చేసి చారిత్రాత్మక తీర్పు వెలువరించింది. కన్నెత్తి చూస్తేనే పాపం చుట్టుకునేలా ప్రవర్తించిన 65 ఏళ్ల వృద్ధుడికి కోర్టు ఉరిశిక్ష విధిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. నేరం జరిగిన కేవలం 60 రోజుల్లోనే నిందితుడికి డెత్ వారెంట్ జారీ చేయడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.
ఈ ఘోరకలి 2026, మే 1వ తేదీన పూణే(Pune) జిల్లాలోని నస్రాపూర్ గ్రామంలో వెలుగుచూసింది. వేసవి సెలవుల్లో భాగంగా బాధితురాలు తన అమ్మమ్మ ఇంటికి వచ్చింది. ఆ అమాయక పసికందును టార్గెట్ చేసిన నిందితుడు.. చాక్లెట్లు, తినుబండారాల ఆశ చూపించి పక్కనే ఉన్న పశువుల పాకలోకి తీసుకెళ్లాడు. అక్కడ ఆ చిన్నారిపై పశువుకంటే హీనంగా దాడి చేసి, వికృత చేష్టలకు ఒడిగట్టాడు. అంతటితో ఆగకుండా తన పాపం బయటపడుతుందనే భయంతో ఆ చిన్నారి గొంతు నొక్కి ప్రాణాలు తీశాడు. ఆడుకోవడానికి వెళ్లిన పాప ఎంతకీ తిరిగిరాకపోవడంతో కుటుంబ సభ్యులు చుట్టుపక్కల వెతకగా.. పశువుల పాకలో అపస్మారక స్థితిలో పడి ఉన్న మృతదేహం లభ్యమైంది. ఈ దారుణంపై నస్రాపూర్ గ్రామస్తులతో పాటు పూణే అంతటా తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి.
ఈ కేసును అత్యంత సవాలుగా తీసుకున్న పోలీసులు.. ఘటన జరిగిన రోజునే నిందితుడిని అరెస్ట్ చేశారు. సాంకేతిక ఆధారాలను వేగంగా సేకరించి, కేవలం 16 రోజుల్లోనే ఏకంగా 1200 పేజీల భారీ ఛార్జ్‌షీట్‌ను కోర్టు(Court) ముందుంచారు. నిందితుడు ఆ చిన్నారిని తీసుకెళ్తున్న దృశ్యాలు సీసీటీవీలో రికార్డు కావడం ఈ కేసులో ప్రాసిక్యూషన్‌కు బలమైన అస్త్రంగా మారింది. కోర్టులో విచారణ సందర్భంగా నిందితుడి గతాన్ని పరిశీలించిన న్యాయమూర్తి షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. సదరు వృద్ధుడికి నేర చరిత్ర ఉందని, గతంలో కూడా రెండు కేసుల్లో జైలు శిక్ష అనుభవించి బయటకు వచ్చాడని కోర్టు గుర్తు చేసింది. జైలు నుంచి వచ్చినా అతని ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాలేదని, కనీస పశ్చాత్తాపం కూడా లేదని ధ్వజమెత్తింది. ఇలాంటి కరడుగట్టిన నేరస్థుడు సమాజంలో తిరిగితే మహిళలకు, చిన్న పిల్లలకు అస్సలు రక్షణ ఉండదని, వీడు సమాజానికి ఎప్పటికీ ప్రమాదకరమేనని కోర్టు అభిప్రాయపడింది.
మే 28న ఛార్జీలు నమోదు చేసిన కోర్టు.. జూన్ 20 నాటికి ఇరుపక్షాల వాదనలు ముగించింది. జూన్ 25న నిందితుడిని దోషిగా తేల్చి.. తాజాగా ఉరిశిక్ష(Hanging)ను ఖరారు చేసింది. నేరం జరిగిన నెలరోజుల్లోనే విచారణ పూర్తి చేసి, రెండు నెలలు తిరగకముందే మృగాడికి ఉరిశిక్ష ఖరారు చేయడం ద్వారా న్యాయవ్యవస్థపై ప్రజల్లో నమ్మకం మరింత పెరిగిందని చట్ట నిపుణులు కొనియాడుతున్నారు. బాధితురాలి ఆత్మకు ఇప్పటికైనా శాంతి చేకూరిందని స్థానికులు కన్నీటి పర్యంతమయ్యారు.