2016లో ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ అమరావతి రాజధానికి అసెంబ్లీలో మద్దతు పలికారు..ఆ తర్వాత 2019లో సీఎంగా ఉన్నప్పుడు అమరావతిని వ్యతిరేకించి మూడు రాజధానులంటూ మూడు ముక్కలాట ఆడారు...కట్ చేస్తే, 2024లో వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కని స్థితిలో పులివెందుల ఎమ్మెల్యేగా ఉన్న జగన్ మావిగన్ అంటూ మరో కొత్త పల్లవి అందుకున్నారు. మావిగన్ పేలక ముందే అసలు విజయవాడే మన రాజధాని అంటూ జగన్ చేసిన కామెంట్లు ట్రోలింగ్ కు గురవుతున్నాయి. ఈ క్రమంలోనే జగన్ పై ఏపీ సీఎం చంద్రబాబు విమర్శలు గుప్పించారు.
"అసెంబ్లీలో అమరావతిని రాజధానిగా ఒప్పుకొని, అధికారంలోకి వచ్చాక మూడు రాజధానుల నాటకమాడి, అధికారం పోయాక నిన్న విజయవాడ, నేడు 'మావిగన్' అంటూ మాట్లాడుతున్నారు. ఇది మతిస్థిమితం లేని రాజకీయానికి నిదర్శనం" అని చంద్రబాబు అన్నారు. రాష్ట్ర భవిష్యత్తు, ప్రజల ఆత్మాభిమానంతో ముడిపడిన రాజధాని వంటి సున్నితమైన అంశంపై జగన్ వి బాధ్యతారహితమైన వ్యాఖ్యలని విమర్శించారు.
మొన్న మావిగన్...నిన్న విజయవాడ...రేపు ఏమంటారో అని జగన్ పై చంద్రబాబు సెటైర్లు వేశారు. ఇలాంటి మతిస్థిమితం లేని మాటలు, రాజకీయాలను తన జీవితంలో మొదటిసారి చూస్తున్నానని అన్నారు.
రాజధానిపై జగన్ గందరగోళం సృష్టిస్తున్న పరిస్థితుల్లో తాము రాయలసీమ ప్రజల దశాబ్దాల కలను నిజం చేస్తూ జేఎస్ డబ్ల్యూ స్టీల్ ప్లాంట్ పనులను ప్రారంభించామని చెప్పారు. 2019, 2023లో జగన్ 2 సార్లు ఇదే స్టీల్ ప్లాంట్‌కు మోసపూరిత శంకుస్థాపనలు చేశారని ఎద్దేవా చేశారు. కానీ, తాము 24 నెలల్లో అంటే 2026 జూలై 3వ తేదీ నాటికి ఈ ప్లాంట్ నిర్మాణం పూర్తి చేసి జాతికి అంకితం చేస్తానని హామీనిచ్చారు. కావాలంటే డేట్ రాసిపెట్టుకోవాలని చెప్పారు.