రాజకీయాల్లో సరికొత్త అధ్యాయాన్ని లిఖించాలని అడుగులు వేస్తున్న మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు తొలి అడుగులోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆమె ప్రతిపాదించిన నూతన రాజకీయ పార్టీ ‘తెలంగాణ రక్షణ సేన’ (TRS) నమోదు ప్రక్రియకు కేంద్ర ఎన్నికల సంఘం తాత్కాలికంగా బ్రేకులు వేసింది. సాంకేతిక లోపాలు, చట్టపరమైన చిక్కులను ప్రతిపాదిస్తూ ఈసీ పంపిన అధికారిక లేఖ ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
రాష్ట్ర రాజకీయ చరిత్రలో ‘టిఆర్ఎస్’ అనే మూడక్షరాలకు ఉన్న క్రేజ్, సెంటిమెంట్ ప్రత్యేకమైనవి. గతంలో ఒక ప్రధాన ప్రాంతీయ పార్టీ ఇదే సంక్షిప్త నామంతో సుదీర్ఘకాలం ప్రజల్లో కొనసాగింది. ఇప్పుడు మళ్లీ అదే పేరుతో (Telangana Rakshana Sena) పార్టీని తీసుకురావడం వల్ల ఓటర్లలో తీవ్ర గందరగోళం నెలకొనే ప్రమాదం ఉందని ఎన్నికల సంఘం అభిప్రాయపడింది. పౌరుల నుంచి వచ్చిన అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకున్న ఈసీ.. పాత పార్టీల పేర్లను పోలినట్లుగా కొత్త పేర్లు ఉండకూడదనే నిబంధనను గుర్తు చేస్తూ ఈ రిజిస్ట్రేషన్‌ను తిరస్కరించింది.
ఈ ఊహించని పరిణామంతో కవిత క్యాంప్ ఒక్కసారిగా అలర్ట్ అయింది. పార్టీ పేరును మార్చుకోవడానికి లేదా ప్రత్యామ్నాయ పేర్లను సూచించడానికి ఎన్నికల సంఘం కేవలం 15 రోజుల గడువు మాత్రమే విధించింది. అయితే, ఈసీ(EC) నిర్ణయంపై కవిత అనుచరులు, వ్యూహకర్తలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కేవలం రెండు అభ్యంతరాలను మాత్రమే చూపిస్తూ, మిగిలిన వివరాలను వెల్లడించకుండా ప్రత్యామ్నాయ పేర్లను ఎలా అడుగుతారంటూ ఈసీకి సమాధానం పంపినట్లు తెలుస్తోంది.
అయితే ప్రస్తుతం కవిత(Kavitha) ముందు రెండు దారులు ఉన్నాయి. ఒకటి.. ఈసీ నిబంధనల ప్రకారం, తెలంగాణ సెంటిమెంట్ దెబ్బతినకుండా మరో కొత్త పేరును ఎంపిక చేసి 15 రోజుల్లోగా పంపడం. రెండు.. ఈసీ లేఖను సవాల్ చేస్తూ కోర్టు మెట్లు ఎక్కడం. అవసరమైతే న్యాయపోరాటానికైనా సిద్ధమేనని కవిత వర్గం సంకేతాలిస్తోంది. మరి ఈ 15 రోజుల డెడ్‌లైన్ లోగా కవిత ‘TRS’ చిక్కు ముడిని ఎలా విప్పుతారో, ఎలాంటి వ్యూహంతో ముందుకు వెళ్తారో చూడాలి.