`అన్న‌య్య‌`కు `త‌మ్ముడి`గా పుట్టినందుకు.. : ప‌వ‌న్‌

News Image

మెగా స్టార్ చిరంజీవికి బ్రిట‌న్ పార్ల‌మెంటు ఘ‌న స‌త్కారం చేసింది. ప్ర‌తిష్టాత్మ‌క `హౌస్ ఆఫ్ కామ‌న్స్‌` బిరుదును ఇచ్చి స‌త్క‌రించింది. అదేవిధంగా సినీ రంగంలోనూ, సేవా రంగంలోనూ చిరు చేసిన విశేష కృషికి గుర్తింపుగా `జీవిత సాఫల్య` పురస్కారం సైతం బ్రిట‌న్ ప్ర‌భుత్వం అందించింది. ఈ నేప‌థ్యాన్ని పుర‌స్క‌రించుకుని ఏపీ డిప్యూటీ సీఎం, జ‌న‌సేన పార్టీ అధినేత ప‌వ‌న్‌ క‌ల్యాణ్ భావోద్వాగానికి గుర‌య్యారు. “అన్న‌య్య‌కు త‌మ్ముడిగా పుట్టినందుకు ఎంతో గ‌ర్వ‌ప‌డుతున్నా“ అని పేర్కొన్నారు. సోష‌ల్ మీడియా `ఎక్స్‌`లో స్పందించిన ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. చిరంజీవిప‌డిన క‌ష్టానికి ప్ర‌తిఫ‌లమే ఈ అవార్డు, స‌త్కారం అని కొనియాడారు. సాధార‌ణ కానిస్టేబుల్ కు కుమారుడిగా జ‌న్మించిన చిరంజీవి.. స్వ‌యం కృషితో తాను ఎంచుకున్న రంగంలో శిఖ‌రాయ‌మాన స్థాయికి చేరుకున్నార‌ని తెలిపారు. 45 ఏళ్లుగా క‌ళారంగానికి ఆయ‌న చేస్తున్న సేవలు అజ‌రామ‌ర‌మ‌ని పేర్కొన్నారు. ప్ర‌పంచ వ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సంపాయించుకున్నార‌ని తెలిపారు. అలాంటి చిరంజీవికి త‌మ్ముడిగా జ‌న్మించ‌డం త‌న‌కు గ‌ర్వంగా ఉంద‌ని.. ఇది త‌న అదృష్ట‌మ‌ని ప‌వ‌న్ క‌ల్యాణ్ పేర్కొన్నారు. “ఆయ‌న్ని(చిరు) నేను అన్న‌గా కంటే కూడా తండ్రి స‌మానుడిగా భావిస్తా. నా జీవితంలో ఏం చేయాలో తెలియని సంద‌ర్భంలో అయోమయంలో కూరుకుపోయిన పరిస్థితుల్లో నాకు మార్గం చూపించిన వ్యక్తి అన్నయ్య. నా జీవితానికి హీరో చిరంజీవి“ అని ప‌వ‌న్ క‌ల్యాణ్ వ్యాఖ్యానించారు. చిరంజీవి తాను ఎద‌గ‌డ‌మే కాకుండా.. త‌న కుటుంబాన్ని కూడా పైకి తీసుకువ‌చ్చార‌ని పేర్కొన్నారు.

Related News