జ‌గ‌న్‌కి బిగ్ షాక్.. వైసీపీలో మ‌రో బిగ్ వికెట్ డౌన్‌.!

admin
Published by Admin — July 22, 2026 in Politics, Andhra
News Image

ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) రాజకీయాల్లో అధికారంలో లేనప్పుడు అసంతృప్తులు బయటపడటం సహజమే కానీ, అనకాపల్లి జిల్లా వైసీపీలో జరుగుతున్న పరిణామాలు మాత్రం ఆ పార్టీ అధిష్టానానికి పెద్ద తలనొప్పిగా మారాయి. ఉత్తరాంధ్రలో పట్టున్న సీనియర్ నాయకుడు, ఎలమంచిలి నియోజకవర్గంలో సొంత అనుచర గణం దండిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే ఉప్పలపాటి వెంకట రమణమూర్తి రాజు (కన్నబాబురాజు) వైసీపీకి దాదాపు దూరమైనట్లేననే ప్రచారం జోరందుకుంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఆయన టెక్నికల్ గా మాత్రమే కొనసాగుతున్నారని, ఏ క్షణమైనా గుడ్ బై చెప్పడం ఖాయమనే సంకేతాలు వెలువడుతున్నాయి.

మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన అనుభవం ఉన్న కన్నబాబురాజు(Kannababu Raju), గత కొంతకాలంగా పార్టీ కార్యకలాపాలకు పూర్తిగా దూరంగా ఉంటున్నారు. ఇటీవల ఆయన పుట్టినరోజు వేడుకల్లో సైతం స్థానిక వైసీపీ నేతల సందడి ఎక్కడా కనిపించలేదు. ఇది కేవలం అనుకోకుండా జరిగిన పరిణామం కాదని, ఆయన పక్కా వ్యూహంతోనే సైలెంట్ అయ్యారని సమాచారం. తాజాగా ఉమ్మడి విశాఖ జిల్లా సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఆధ్వర్యంలో రాంబిల్లి మండలం పంచదార్లలో చేపట్టిన భారీ నిరసన కార్యక్రమానికి కూడా కన్నబాబురాజు గైర్హాజరు కావడం ఈ అనుమానాలకు మరింత బలమిచ్చింది. సొంత నియోజకవర్గంలోనే అంతటి పెద్ద కార్యక్రమం జరుగుతున్నా ఆయన రాకపోవడం స్థానిక రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

కన్నబాబురాజు అసంతృప్తికి ప్రధాన కారణం పార్టీ అధిష్టానం తీసుకున్న ఒక నిర్ణయమేనని తెలుస్తోంది. 2019లో వైసీపీ(YCP) నుంచి గెలిచి, 2024 ఎన్నికల్లో ఓటమి పాలైనప్పటికీ, ఆయననే నియోజకవర్గ ఇన్‌చార్జిగా కొనసాగించారు. అయితే, ఆ తర్వాత సామాజిక సమీకరణాలను బూచిగా చూపిస్తూ మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీకి ఎలమంచిలి బాధ్యతలు అప్పగించడాన్ని కన్నబాబురాజు జీర్ణించుకోలేకపోయారు. పార్టీ కోసం సుదీర్ఘకాలం పనిచేసిన తనకు ప్రాధాన్యత తగ్గించడంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న ఆయన, ఆనాటి నుంచే పార్టీతో బంధాన్ని తెంచుకోవడానికి సిద్ధపడినట్లు ప్రచారం సాగుతోంది.

ప్రస్తుతం ఎలమంచిలి వైసీపీలో కన్నబాబురాజు వర్గం, కరణం ధర్మశ్రీ వర్గం వేర్వేరుగా వ్యవహరిస్తుండటంతో కేడర్‌లో తీవ్ర అయోమయం నెలకొంది. వచ్చే ఎన్నికల నాటికి నియోజకవర్గాల పునర్విభజన జరిగే అవకాశాలు ఉన్నందున, తన కుమారుడు (డిసిసిబి మాజీ చైర్మన్) సుకుమార్ వర్మను బరిలోకి దించేందుకు కన్నబాబురాజు పావులు కదుపుతున్నారు. అప్పటి రాజకీయ పరిస్థితులను బట్టి వేరే దారి చూసుకోవాలనే ఆలోచనలో ఆయన ఉన్నారు. ఏది ఏమైనా, ఉత్తరాంధ్రలో దశాబ్దాలుగా బలమైన నేతగా ఉన్న కన్నబాబురాజు వైసీపీకి హ్యాండ్ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తుండటంతో జగన్(Jagan) మార్కా పునాదులకు మరో పెద్ద వికెట్ పడినట్లేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

Tags
AP Politics YSRCP YS Jagan Kannababu Raju Elamanchili Politics Anakapalli
Recent Comments
Leave a Comment

Related News