రైలు ప్రయాణికులకు బంపర్ ఆఫర్!

admin
Published by Admin — July 25, 2026 in National
News Image

రైలు ప్రయాణం...చాలామందికి ఇదో అందమైన అనుభూతి. కానీ, కొంతమందికి మాత్రం కొన్ని రైలు ప్రయాణాలు చేదు జ్ఞాపకాలు. ప్రయాణికులకు సరిపడా లేని జనరల్ బోగీలు...చివరి నిమిషం వరకు తెగని వెయిటింగ్ లిస్ట్ పంచాయతీలు... తత్కాల్ టికెట్ల కోసం ఇటు ఆన్ లైన్ లో అటు ఆఫ్ లైన్ లో యుద్ధాలు...అబ్బో ఇవన్నీ దాటి రైలు బోగీలో మన సీటు లేదా బెర్తులో మనం కూర్చునే వరకు చాలామంది ప్రయాణికులు ఒక అశ్వమేధ యాగం చేసినట్లే ఫీలవుతారంటే అతిశయోక్తి కాదు. వీటన్నిటికీ కారణం సరిపడినన్ని రైళ్లు, కోచ్ లు, బెర్తులు లేకపోవడం. అయితే, ఇకపై ఈ తరహా కష్టాలకు ఇండియన్ రైల్వేస్ కట్ చెప్పే దిశగా అడుగులు వేస్తోంది.

రైల్వే ప్రయాణికులకు భారతీయ రైల్వే తీపి కబురు చెప్పింది. జనరల్, స్లీపర్ కలిపి మొత్తం 17వేల కోచ్ లను రైళ్లకు జోడించబోతోంది. గడిచిన దశాబ్దకాలంలో ఈ సంఖ్యంలో కోచ్ లు జోడించిన దాఖలాలు లేవు.

కొత్త కోచ్ ల చేరికతో సీట్లు, బెర్తులు పెరిగి వెయిటింగ్ లిస్ట్ తగ్గుతుంది. ముఖ్యంగా వేసవి, పండుగలు, నూతన సంవత్సరం వంటి సెలవుల్లో ప్రయాణికులు పడే కష్టాలకు చెక్ పడబోతోంది. కొత్త కోచ్ లను ఆల్రెడీ ఉన్న రైళ్లకు జోడించడం వల్ల 25-30% అదనపు సీట్లు అందుబాటులోకి రాబోతున్నాయి. ముఖ్యంగా జనరల్ కోచ్ ల సంఖ్య పెరడగం వల్ల చివరి నిమిషంలో ప్రయాణం చేసేవారికి, పేద, దిగువ మధ్య తరగతి ప్రయాణికులకు బిగ్ రిలీఫ్ దొరికినట్లవుతుంది.

మామూలుగా అయితే జనరల్ కోచ్ లలో కాలు పెట్టేందుకు కూడా చోటు ఉండేది కాదు. కానీ, ఇకపై ఆ పరిస్థితి మారబోతోంది. ఇక, స్లీపర్ కోచ్ లు జనరల్ కోచ్ లుగా మారాయి అన్న అపప్రద కూడా ఉంది. అయితే, కొత్త బెర్త్ ల చేరికతో కోచ్ కు 72 బెర్తులు అదనంగా లభిస్తాయి. అంతేకాదు, రైళ్ల పొడవు కూడా పెరగనుంది. ప్రస్తుత రైళ్లకు 2-3 అదనపు కోచ్ లు జోడించడం, టైర్-2/టైర్-3 నగరాలకు

కొత్త రైలు మార్గాలు ప్రారంభించడం, ఆధునిక ఎల్ హెచ్ బీ కోచ్ లు జోడించడం వంటి పరిణామాలతో ప్రయాణికులు సౌకర్యం నిజంగానే సుఖవంతం కానుంది. ఎల్ హెచ్ బీ కోచ్ ల వల్ల రైళ్లలో గతంతో పోలిస్తే మెరుగైన భద్రత, పరిశుభ్రమైన టాయిలెట్లు, చార్జింగ్ పాయింట్లు, మెరుగైన సస్పెన్షన్ వంటి సౌకర్యాలు లభించనున్నాయి.

కోవిడ్ తర్వాత రైలులో ప్రయాణించేవారి సంఖ్య 40% పెరిగింది. వందే భారత్ పై చాలామంది ఫోకస్ చేసినా, సాధారణ ప్రజల కోసం జనరల్/స్లీపర్ కోచులు కూడా అవసరం ఉందన్న విషయాన్ని రైల్వే శాఖ గుర్తించింది.

హైదరాబాద్/సికింద్రాబాద్ జోన్ నుంచి భారీగా రద్దీ పెరిగింది. అదనపు కోచ్ లు వేయడం వల్ల సౌత్ సెంట్రల్ రైల్వేకు కూడా మంచి ఆదాయం వస్తుంది. హైదరాబాద్-బెంగళూరు, హైదరాబాద్-ముంబై మార్గాల్లో ప్రయాణించేవారికి కూడా కొత్త కోచ్ లు ప్రయోజనకరంగా ఉంటాయి.

17,000 కోచ్ ల చేరికతో అదనంగా 12-13 లక్షల కొత్త సీట్లు, బెర్తులు అందుబాటులోకి వస్తాయి. దీంతో, ప్రయాణికులకు పాత ఛార్జీలతోనే టికెట్ సులభంగా దొరుకుతుంది, ప్రయాణం సౌకర్యవంతంగా ఉంటుంది. ఇవన్నీ పూర్తి స్థాయిలో అందుబాటులోకి రావడానికి 2-3 సంవత్సరాలు పట్టవచ్చు. కొన్ని కోచ్ లు అందుబాటులోకి వచ్చిన వెంటనే రైళ్లకు జోడిస్తున్నారు. తమ రైల్వే ప్రయాణ కష్టాలకు చెల్లు చీటీ చెప్పేందుకు ప్రయత్నాలు ప్రారంభించిన రైల్వే శాఖకు రెగ్యులర్ రైలు ప్రయాణికులు ధన్యవాదాలు చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వం, రైల్వే మంత్రిత్వ శాఖకు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ఇకపై తమ రైలు ప్రయాణం నిజంగానే సుఖవంతం కానుందని వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Tags
Good news railway passengers new coaches 17000 coaches reforms No more waiting list
Previous News Next News
Recent Comments
Leave a Comment

Related News