రాజకీయాల్లో ముక్కుసూటిగా మాట్లాడటంలో తప్పు లేదు. కాకుంటే.. ముందు వెనుకా చూసుకొని మాట్లాడాల్సిన అవసరం చాలా ముఖ్యం. తనను తాను ప్రత్యేకమైన రాజకీయనేతగా భావించేటోళ్లు కొందరు ఉంటారు. ఆ కోవలోకే వస్తారు చేవెళ్ల బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి. తాజాగా ఢిల్లీలో సీజేపీ (కాక్రోచ్ జనతా పార్టీ) నిర్వహించిన ఆందోళనల్లో ఢిల్లీ పోలీసులు జరిపిన లాఠీ ఛార్జ్ సంచలనంగా మారటం.. పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తటం తెలిసిందే. దీనిపై అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం స్పందిస్తూ.. ‘‘కేవలం నిరసనలు.. ఆందోళనలు జరుగుతున్నాయనే కారణంతో పోలీసులు లాఠీ చార్జ్.. బలప్రయోగం చేయడాన్ని సమర్థించలేం’’ అంటూ వ్యాఖ్యలు చేయటం మర్చిపోలేం.
అందుకు భిన్నంగా.. కాస్తంత బాధ్యత లేని విధంగా.. ప్రభుత్వ విధానాల్ని వ్యతిరేకిస్తూ ఉద్యమించిన వారిని ఉద్దేశించి చేవెళ్ల ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఆయన ఈ అంశంపై తన అభిప్రాయాన్ని సోషల్ మీడియాలో పోస్టు రూపంలో పెట్టారు. ‘‘ఇది భారతదేశం కాబట్టి పోలీసులు కేవలం లాఠీఛార్జ్ చేసి వదిలేశారు. అదే అమెరికా లాంటి విదేశాల్లో అయితే ఇలాంటి నిరసనకారులను కాల్చి పడేసేవారు’’ అంటూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి.
ఇటీవల కాలంలో ఈ తరహా సంచలన వ్యాఖ్యలు చేయటం కొండాకు పరిపాటిగా మారింది. ఆందోళనలు.. నిరసనలు చేస్తున్న ఆందోళనాకారుల్ని కాల్చేస్తారన్న కొండా.. అక్కడితో ఆకుండా ఈ నిరసనల వెనుక విదేశీ నిధులు ఉన్నాయని.. నిజమైన విద్యార్థులు లేరన్నారు. కేవలం రోహింగ్యాలు.. ఖలీస్తాన్ మద్దతుదారులు..కశ్మీరీ వేర్పాటువాదులు మాత్రమే పాల్గొన్నారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. ఒక ఎంపీగా బాధ్యతతో చేయాల్సిన వ్యాఖ్యల్ని.. ఎలాంటి ఆధారాల్ని చూపకుండా మాటలకు తెగ పడటం గమనార్హం. ఈ తీరును పలువురు తప్పు పడుతున్నారు.
కొండా మాటలు ఈ మధ్యన తరచూ సంచలనంగా మారుతున్నాయి. కొద్దినెలల క్రితం రంగారెడ్డి జిల్లాలో జరిగిన ఒక హోర రోడ్డు ప్రమాదంలో పలువురు అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఇలాంటి విషాద సమయంలో ఇదే అంశాన్ని కొండా స్పందిస్తూ.. బాగా లేని రోడ్లతో తక్కువ ప్రమాదాలు జరుగుతాయన్న వింత వాదనను తెర మీదకు తీసుకొచ్చారు. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు రావటంతో.. ఆయన వెనక్కి తగ్గి.. తాను చేసిన వ్యాఖ్యలకు తప్పుడు అర్థం వచ్చేలా మీడియా రిపోర్టు చేసినట్లుగా వ్యాఖ్యానించారు.
ఇదే ఏడాది మేలో ఆయన మరో వివాదాస్పద వ్యాఖ్య చేశారు. తెలంగాణలోని కాంగ్రెస్ అధికార పక్షంపై విమర్శలు చేసే క్రమంలో.. నిధుల కోసం కాంగ్రెస్ నేతలు చిప్ప చేతిలో పట్టుకొని ఢిల్లీకి పోతున్నట్లుగా తెగపడ్డారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. ఇతర మంత్రులు ఢిల్లీకి వెళ్లి కేంద్రం సాయం అడుగుతూనే.. మళ్లీ అదే కేంద్రంపై విమర్శలు చేసేడా? అంటూ ప్రశ్నించటమే కాదు..అవసరానికి మించి నోటికి పని చెబుతున్న వైనం కమలనాథులకు కొత్త కష్టాల్్ని తెచ్చే పెట్టేలా మారిందన్న మాట వినిపిస్తోంది. మరి.. కొండా నోటికి తాళాలు వేసే వారెవరు?