``సీదిరి అప్పలరాజు కష్టపడి పైకి వచ్చాడు. పదో తరగతిలో స్టేట్ ఫస్ట్ వచ్చాడు. అంత బాగా చదువుకుని డాక్టర్ అయ్యాడు. అందుకే చంద్రబాబుకు సీదిరి అంటే కోపం. అందుకే హత్య కేసు పెట్టి జైల్లో పెట్టాడు`` అని వైసీపీ అధినేత జగన్ పొంతనలేని వ్యాఖ్యలు చేశారు. సీదిరి అప్పలరాజు ప్రస్తుతం జైల్లో ఉన్నారు. ఆయనను పరామర్శించేందుకు జగన్ శ్రీకాకుళం జిల్లాలోని అంపోలు జైలు వద్దకు వెళ్లారు. అయితే.. జైలు నిబంధనల మేరకు సమయం అయిపోవడంతో అధికారులు జగన్‌ను అడ్డుకున్నారు.
అనంతరం.. అక్కడే జగన్ మీడియాతో మాట్లాడారు. సీదిరి అప్పలరాజు కుటుంబంపై చంద్రబాబు, లోకేష్‌లు పగబట్టారని జగన్ వ్యాఖ్యానించారు. కష్టపడి చదువుకున్న పేదలంటే చంద్రబాబుకు కోపమని వ్యాఖ్యానించారు. వాస్తవానికి సీదిరి చేసిన ఘటనకు, ఆయన పై నమోదైన కేసుకు, ఈ వ్యాఖ్యలకు ఎలాంటి సంబంధం లేదు. అయినా.. జగన్ ఇవే వ్యాఖ్యలు కొనసాగించారు. ఇక, అమాయకుడంటూ.. సీదిరి కుమారుడిని జగన్ వెనుకేసుకు వచ్చారు.
తెలిసో తెలియకో.. ప్రమాదం చేశాడని.. అంతమాత్రాన కేసు పెట్టి బొక్కలో వేస్తారా? అని ప్రశ్నించారు. రాజకీయంగా సీదిరిని ఎదుర్కొనలేక చంద్రబాబు, ఆయన కుమారుడు దొడ్డిదారిలో కేసులు పెట్టి జైలుకు పంపించారని ఆరోపించారు. కుట్రపూరితంగా ఈ కేసును బనాయించారని అన్నారు. సీదిరి అమాయకు డని.. ఆయన కష్టపడి డాక్టర్ చదువుకున్నారని అన్నారు. నారా లోకేష్ మాదిరిగా డొనేషన్లు కట్టి సీదిరి చదువుకోలేదన్నారు. ఆయన స్వయంగా పైకి ఎదిగారని చెప్పారు. అలాంటి సీదిరిని అన్యాయంగా కేసులో ఇరికించారని తెలిపారు.
అంతేకాదు.. చంద్రబాబుకు ఆది నుంచి కూడా సీదిరి అంటే కడుపు మంట అని పొంతనలేని వ్యాఖ్యలు చేశారు. టీడీపీ నేతలు కూడా అనేక యాక్సిడెంట్లు చేశారని.. వారిపై ఇలానే కేసులు పెట్టారా? అని జగన్ ప్రశ్నించారు. సీదిరి అదే టీడీపీలోనో.. బీజేపీలోనో.. జనసేనలోనో ఉంటే కేసులు పెట్టేవారా? అని అన్నారు. ``సీదిరి వైసీపీలో ఉన్నాడు కాబట్టి.. జగన్ అంటే అభిమానిస్తాడు కాబట్టి.. కేసులు పెట్టారు`` అని జగన్ అన్నారు. అయితే.. అసలు ఈ వ్యాఖ్యలకు-వాస్తవ కేసుకు మధ్య సంబంధం లేక పోవడం గమనార్హం.