వరుపుల సత్యప్రభ(Varupula Satyaprabha). టీడీపీ తరఫున తొలిసారి పోటీ చేసి విజయం దక్కించుకున్న నాయకురాలు. వరుపుల రాజా సతీమణిగా ఆమె ప్రజల మన్ననలు సొంతం చేసుకున్నారు. రాజాకు బలమైన కంచుకోటగా ఉన్న కాకినాడ జిల్లాలోని ప్రత్తిపాడు నియోజకవర్గం.. 2023లో ఆయన హఠాన్మరణానంతరం.. సత్యప్రభకు పట్టంకట్టింది. నిజానికి ఆది నుంచి కూడా టీడీపీకి ఇక్కడ బలమైన కేడర్ ఉంది. రాజా దూకుడు కారణంగా.. మరింతగా ఇక్కడ వరుపుల రాజకీయాలకు పునాదులు పడ్డాయి.
అయితే ఇప్పుడు సమస్య ఏంటంటే.. టీడీపీ(TDP) కూటమిలో ఎమ్మెల్యే సత్యప్రభపై అసంతృప్తి పెల్లుబుకుతోందని చర్చ సాగుతోంది. దీనికి కారణం.. ఎమ్మెల్యే అనుసరిస్తున్న వైఖరేనని చెబుతున్నారు. గతంలో ఇక్కడ విజయం దక్కించుకున్న వైసీపీ ఎమ్మెల్యేకు పీఏగా వ్యవహరించిన ఓ నాయకుడు గత ఎన్నికల సమయంలో పార్టీ మారి.. టీడీపీ చెంతకు చేరుకున్నారు. వాస్తవానికి ఇలాంటి వారికి ప్రాధాన్యం తగ్గించాలని పార్టీ అధినేత చంద్రబాబు చెబుతున్నారు. కానీ, వరుపుల మాత్రం ఈయనకు ప్రాధాన్యం పెంచేస్తున్నారు.
ఇచ్చేవి.. పుచ్చుకునేవి.. చర్చించేవి.. ఇలా అన్ని బాధ్యతలను కూడా సదరు జంపింగ్ నాయకుడి చేతిలో పెట్టి.. ఏదైనా ఉంటే ఆయనతోనే మాట్లాడాలని చెబుతున్నారట. దీంతో కేడర్ తీవ్ర అసంతృప్తితో ఉంది. అంతేకాదు.. పొరుగు పార్టీ నుంచి వచ్చిన వారికి ఇస్తున్న ప్రాధాన్యంలో కనీసం పావలా వంతు కూడా తమకు దక్కడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతర్గత చర్చల్లో సత్యప్రభ(Satyaprabha)పై తమ్ముళ్లు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. రాజా మొహం చూసి ఊరుకుంటున్నామని కొందరు చెబుతున్నారు.
మొత్తంగా నియోజకవర్గంలో ఎమ్మెల్యే తిరుగుతున్నా.. సొంత కేడర్‌ను పక్కన పెట్టేయడంతో పాటు.. రాజాతో అను బంధం ఉన్న వారిని కూడా వదిలించుకుని తాజాగా సొంత కేడర్‌ను ముఖ్యంగా తనకు అనుకూలంగా ఉండే వారిని ఎంపిక చేసుకున్నారని కేడర్ వాపోతోంది. అయితే.. చిత్రం ఏంటంటే.. ప్రత్తిపాడులో ఏం జరిగినా.. కార్యకర్తలు బయటపడిపోరు. ఎన్నికల సమయంలోనే తమ సత్తా చూపిస్తున్నారు. గత వైసీపీ(YCP) ఎమ్మెల్యే విషయంలోనూ ఇలానే జరిగింది. మరి ఈ విషయం తెలిసి కూడా సత్యప్రభ జాగ్రత్త పడతారో.. వచ్చే ఎన్నికల్లో చూసుకుంటారో చూడాలి.