టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్(Jr NTR) ఇంట్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆయన ఎంతో ప్రేమగా పెంచుకుంటున్న శునకం 'బఘీరా' మరణించడంతో తారక్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. కొద్ది రోజుల క్రితమే భుజానికి అయిన గాయం నుంచి కోలుకుంటున్న ఆయనకు, ఈ పెంపుడు మూగజీవి మృతి వ్యక్తిగతంగా తీరని లోటును మిగిల్చింది.
బెర్నీస్ మౌంటెన్ డాగ్ జాతికి చెందిన బఘీరా(Bagheera) కేవలం ఒక పెంపుడు జంతువు మాత్రమే కాకుండా, ఎన్టీఆర్ కుటుంబంలో ఒకరిగా కలిసిపోయింది. గత నాలుగేళ్లుగా ఆయనతో ప్రయాణించిన బఘీరా.. నిత్యం ఉత్సాహాన్ని ఇస్తూ ఎంతో ఆప్యాయంగా ఉండేది. అయితే, అనూహ్యంగా అది కన్నుమూయడంతో ఎన్టీఆర్ ఇంట విషాద ఛాయలు అలుముకున్నాయి.

ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటూ తారక్ ఒక ఎమోషనల్ నోట్ విడుదల చేశారు. తన ప్రపంచంలోకి అడుగుపెట్టి కుటుంబ సభ్యుడిగా మారిన బఘీరాతో గడిపిన మధుర క్షణాలను గుర్తుచేసుకుంటూ ఆయన కంటతడి పెట్టారు. బఘీరా జ్ఞాపకార్థం ఇంట్లో ఒక మొక్కను నాటి, తనదైన శైలిలో దానికి నివాళులర్పించారు. "స్వేచ్ఛగా పరిగెత్తు నా చిన్నారి.." అంటూ ఆయన రాసిన ఆఖరి మాటలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుండగా, అభిమానులు సైతం ఈ పోస్ట్ చూసి భావోద్వేగానికి గురవుతున్నారు. కాగా, ఒకవైపు భుజం గాయానికి జరిగిన సర్జరీ నుంచి పూర్తిగా కోలుకోవడానికి విశ్రాంతి తీసుకుంటున్న తారక్(Tarak)కు, ఈ పెంపుడు శునకం మరణం మానసికంగా పెద్ద షాక్‌ను ఇచ్చింది. ప్రస్తుతం ఆయన వైద్యుల పర్యవేక్షణలో రిహాబిలిటేషన్ తీసుకుంటూ, త్వరలోనే పూర్తి ఆరోగ్యంతో మళ్లీ షూటింగ్స్‌లో పాల్గొనేందుకు సిద్ధమవుతున్నారు.