తెలుగు తెరపై తనదైన నటనతో అన్ని వర్గాలను ఆకర్షించిన నటీమణి.. `తాయారమ్మ-బంగారయ్య` చి త్రం ద్వారా తాయారమ్మగా ప్రసిద్ధి పొందిన జానకి.. ఉరఫ్ `షావుకారు` జానకి ఇకలేరు. 94 ఏళ్ల వయసులో వయోసంబంధిత అనారోగ్య సమస్యలతో ఆమె కన్నుమూశారు. జానకికి ఒక కుమారుడు ఉన్నారు. ఆయన అమెరికాలో స్థిరపడినట్టు గతంలో ఇచ్చిన ఇంటర్యూలలో జానకి వెల్లడించారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని రాజమండ్రిలో జన్మించిన జానకి.. 11 ఏళ్ల వయసులోనే కుటుంబ ఆర్థిక సమస్యలతో రేడియో ఆర్టిస్టుగా మారారు.
అక్కడి నుంచి ఆమె ప్రస్థానం సినీ రంగానికి ప్రవేశించింది. వివాహం అయిన తర్వాత కూడా.. అనేక సినిమాల్లో హీరోయిన్‌గా నటించి మెప్పించిన జానకి.. 1949లో వచ్చిన `రక్ష రేఖ` సినిమాతో తొలి సారి వెండి తెరపై కనిపించారు. అయితే, ఆ సినిమా కంటే కూడా.. ఎన్టీఆర్‌తో నటించిన `షావుకారు` సినిమా సూపర్ డూపర్ హిట్టయింది. ఆ పేరే ఆమె ఇంటి పేరుగా శాస్వతంగా నిలిచిపోయింది. ఆ తర్వాత.. అనేక సినిమాల్లో షావుకారు జానకి నటించారు. ప్రతి సినిమాలోనూ తనదైన శైలి నటనతో తెలుగు, తమిళ, కన్నడ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.
సావిత్రితో పోటీ..
మహానటి సావిత్రి తెరంగేట్రం చేసిన తర్వాత..అప్పటి వరకు ఉన్న అనేక మంది హీరోయిన్లు తెరమరు గయ్యారు. కానీ.. జానకి మాత్రం నిలదొక్కుకున్నారు. దీనికి కారణం.. ఉచ్ఛారణ, తెలుగుదనం.. రాజీపడ ని మనస్తత్వం.. వంటివి ఆమెకు ప్రేక్షకులకు మధ్య బాండింగ్ పెంచాయి. దక్షిణాది భాషలు సహా హిందీ లోనూ నటించిన ఆమె మొత్తం 400 సినిమాలకు పైగా నటించారు. సినిమా రంగంపై తన అభిప్రాయాల ను నిర్మొహమాటంగా వెల్లడించే జానకి.. తన జీవితంలో జరిగిన ఘటనలను కూడా దాచుకోకపోవడం గమనార్హం.
సత్యసాయికి ఆస్తి!
అనంతపురం జిల్లాలోని సత్యసాయి ఆశ్రమానికి జానకి తన ఆస్తిలో సగ భాగం రాసిచ్చిన విషయం చాలా మందికి తెలియకపోవడం గమనార్హం. 50 ఏళ్ల వయసు తర్వాత.. ఆమె తన ఆస్తినికుమారుడికి.. సత్యసా యి ఆశ్రమానికి కూడా చెరిసగం పంచేసినట్టు ఇంటర్వ్యూలలో చెప్పుకొచ్చారు. సంసారం ఒక చదరంగం సినిమాతో మరోసారి ఆమె తెలుగు, తమిళ ప్రేక్షకులకు చేరువయ్యారు. తనకు అవార్డులు రాలేదన్న ఆవేదనను ఎప్పుడూ వ్యక్తం చేయలేదు. కానీ, సరైన గుర్తింపు రాలేదని మాత్రం వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్, ఏఎన్నార్‌లతో అనేక చిత్రాలు చేసిన జానకి.. అప్పటి సినీ రంగంలో ఒక అధ్యాయాన్ని మిగిల్చారన్నది వాస్తవం.