ప్రపంచ ఐటీ రంగంలో హైదరాబాద్ నగరానికి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఐటీ రంగంలోని దిగ్గజ కంపెనీల చూపు ఎప్పుడూ హైదరాబాద్ వైపే ఉంటుంది. ఈ క్రమంలోనే హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ రంగం బాగా డెవలప్ అయింది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ చరిత్రలో సరికొత్త రికార్డ్ క్రియేట్ అయింది. రాయదుర్గంలో తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ నిర్వహించిన వేలంలో ఎకరం భూమి రూ. 264 కోట్లు పలికి ఆల్ టైం రికార్డ్ క్రియేట్ చేసింది.
5.25 ఎకరాల ప్లాట్ విక్రయించిన టీజీఐఐసీకి 1,386 కోట్ల ఆదాయం వచ్చింది. రాయదుర్గం పాన్‌మక్తాలోని సర్వే నెం. 83/1లో ఉన్న ప్లాట్ నెం. P1 కోసం శుక్రవారం ఈ-వేలం నిర్వహించారు. ఎకరాకు రూ. 175 కోట్ల కనీస ధరతో వేలం మొదలైంద. చివరకు 50.9 శాతం అధిక ధరకు ఆ ప్లాట్ అమ్ముడుపోయింది. గత నెలలో ఇదే ప్రాంతంలో ఎకరా భూమి ధర రూ. 237 కోట్లు పలికింది. తాజా వేలంలో ఆ రికార్డు బద్దలైంది.
హైదరాబాద్ ఐటీ, నాలెడ్జ్ సిటీ గ్రోత్ కారిడార్‌లో ఈ భూమి ఉండడంతో ఇంత ధర పలికింది. ఐటీసీ కోహినూర్ హోటల్‌కు ఎదురుగా, దుర్గం చెరువు, హైటెక్ సిటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌కు అత్యంత సమీపంలో ఈ ప్లాట్ ఉండడం మరో కారణం. ఇదే ఏరియాలో మరో 5.38 ఎకరాల ప్లాట్‌కు ఆగస్టు 28న వేలం జరగనుంది. ఆ వేలంలో ఈ రికార్డు బద్దలవుతుందో లేదో వేచి చూడాలి. 2025లో ఇక్కడ ఎకరా ధర రూ. 177 కోట్లు.