తెలుగు ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీకగా, స్వాతంత్ర్య సమరంలో ధైర్యానికి మారుపేరుగా నిలిచిన ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారి 155వ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ సంస్థ చైర్మన్ కె. బుచ్చి రాంప్రసాద్ గారు, ప్రకాశం పంతులు గారి మనవరాలు శ్రీమతి ప్రభావతి గారు, మనవడు శ్రీ టంగుటూరి శ్రీరామ్ గారుతో కలిసి పాల్గొని ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా చైర్మన్ కె. బుచ్చి రాంప్రసాద్ గారు మాట్లాడుతూ, “ప్రకాశం పంతులు గారు ఒక వ్యక్తి కాదు.. ఒక చరిత్ర. ఆయన పేరు వినగానే తెలుగు ప్రజల ఆత్మగౌరవం గుర్తుకొస్తుంది. బ్రిటిష్ తుపాకులు ఎదురుగా ఉన్నా వెనుకడుగు వేయకుండా తన గుండెను చూపించిన ఆ ధైర్యం భారత స్వాతంత్ర్య చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది. అందుకే ఆయనను ప్రజలు ప్రేమతో ‘ఆంధ్రకేసరి’గా గౌరవించారు” అని అన్నారు.
“దేశం కోసం జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడి జయంతిని ఆయన కుటుంబ సభ్యులతో కలిసి జరుపుకోవడం నాకు ఎంతో భావోద్వేగమైన, గర్వకారణమైన సందర్భం. ప్రభావతి గారు, శ్రీ టంగుటూరి శ్రీరామ్ గారితో కలిసి ఆ మహానుభావుడి జ్ఞాపకాలను స్మరించుకోవడం ద్వారా ప్రకాశం పంతులు గారి త్యాగాలను మరింత దగ్గరగా అనుభూతి చెందాను” అని చైర్మన్ గారు పేర్కొన్నారు.
ప్రకాశం పంతులు గారు పదవుల కోసం కాదు.. ప్రజల కోసం, దేశం కోసం, తెలుగు జాతి ఆత్మగౌరవం కోసం జీవించారని అన్నారు. ఆయన చూపిన నిస్వార్థం, ధైర్యం, ప్రజాసేవా స్ఫూర్తి నేటి తరానికి మార్గదర్శకమని తెలిపారు.
“ఆంధ్రకేసరి చూపిన ధైర్యం మనలో ఉండాలి.. ఆయన చూపిన ప్రజాసేవ మన ఆచరణలో ఉండాలి.. ఆయన కాపాడిన ఆత్మగౌరవం మన తరాలకు నిలిచిపోవాలి. ప్రకాశం పంతులు గారి పేరు ఉన్నంతకాలం తెలుగు ప్రజల గుండెల్లో ఆయన స్ఫూర్తి సజీవంగానే ఉంటుంది” అని చైర్మన్ కె. బుచ్చి రాంప్రసాద్ గారు అన్నారు.
ఈ సందర్భంగా ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారికి ఘనంగా నివాళులర్పించి, ఆయన ఆశయాలను కొనసాగించడమే ఆయనకు అందించే నిజమైన నివాళి అని చైర్మన్ గారు పేర్కొన్నారు.