కూటమిలో సీట్ల హీట్.. ప‌వ‌న్ డిమాండ్ల‌కు బాబు దిగొస్తారా?

admin
Published by Admin — September 06, 2026 in Politics, Andhra
News Image

ఏపీ(AP)లో స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగింది. మున్సిపల్‌, కార్పొరేషన్ల బరిలో ఎవరికి ఎన్ని సీట్లు అన్న దానిపై కూటమి పార్టీల మధ్య చర్చలు జోరందుకున్నాయి. ఈ నేపథ్యంలో జనసేన పార్టీ డిమాండ్లు, వాటికి టీడీపీ ఎలా స్పందిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. గత సార్వ‌త్రిక ఎన్నికల్లో జనసేన కేవలం 21 అసెంబ్లీ, రెండు ఎంపీ స్థానాల్లోనే పోటీ చేసి, పోటీ చేసిన స్థానాల్లో వందశాతం విజయాలు నమోదు చేసుకుంది. అయితే ఈసారి స్థానిక ఎన్నికల్లో మాత్రం అంతకుమించిన సీట్లపై గురిపెట్టింది ఆ పార్టీ. జగన్‌ను గద్దె దింపేందుకు, చంద్రబాబును సీఎం చేసేందుకు గత ఎన్నికల్లో తాము చేసిన త్యాగాలు చాలని.. ఇప్పుడు పార్టీ మరింత బలపడిన నేపథ్యంలో ఈసారి అలాంటి రాజీలకు సిద్ధంగా లేమని జనసేన నేతలు అంటున్నారు.

ఈ క్రమంలోనే పార్టీ కీలక నేత నాదెండ్ల మనోహర్‌.. తమకు పట్టున్న అన్ని స్థానాల్లో పోటీ చేస్తామంటూ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. టీడీపీ(TDP) నేత లోకేష్ గతంలో ప్రస్తావించిన 15 శాతం సీట్ల మాటకు ఇది పరోక్ష కౌంటర్‌గా అభివర్ణిస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. గత ఎన్నికల్లో సర్దుబాట్లకు వెనుకాడని జనసేన.. ఈసారి మాత్రం అవసరమైతే మిత్రపక్షంపై కాస్త ఒత్తిడి తెచ్చైనా ఎక్కువ సీట్లు దక్కించుకోవాలన్న పట్టుదలతో ఉంది. గత ఎన్నికల్లో అవకాశం అందుకోలేకపోయిన నేతలు, ద్వితీయ శ్రేణి కార్యకర్తలు ఈసారి మేయర్‌, జడ్పీ చైర్మన్‌, మున్సిపల్ చైర్మన్ పదవులపై ఆశలు పెట్టుకున్నారు. పార్టీ కోసం శ్రమించిన వీరమహిళలు కూడా ఈసారి తమకు తగిన ప్రాధాన్యం కోరుకుంటున్నారని సమాచారం.

ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలోని కీలకమైన ఐదు కార్పొరేషన్లపై జనసేన(Janasena) గురిపెట్టింది. విజయవాడ, కాకినాడ, తిరుపతి, ఒంగోలు, ఏలూరు కార్పొరేషన్లలో మేయర్ పదవులు కోరే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పదహారు కార్పొరేషన్లలో ఏకంగా ఐదింటిని కోరడం కాస్త ఎక్కువేనన్నది టీడీపీ వర్గాల మాట. అయితే క్షేత్రస్థాయిలో కూటమి బలాన్ని కాపాడుకోవడం రెండు పార్టీలకు చాలా ముఖ్యం.

సీట్ల వారీగా చూస్తే.. విజయవాడ(Vijayawada) కార్పొరేషన్‌ను వదులుకునేందుకు టీడీపీ పెద్దగా మొగ్గు చూపడం లేదు. ఏలూరు విషయంలో మాత్రం జనసేన గట్టిగానే పట్టుబడుతున్నట్టు తెలుస్తోంది. తిరుపతిలో గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆ స్థానాన్ని జనసేనకే కేటాయించిన నేపథ్యంలో.. ఇప్పుడు మేయర్ పదవి కూడా ఆ పార్టీకే దక్కుతుందా అన్నది ఆసక్తికరంగా మారింది. ఒంగోలు విషయంలో స్థానిక సమీకరణాలు కాస్త క్లిష్టంగా ఉన్నాయి. అక్కడి టీడీపీ ఎమ్మెల్యేకు, జనసేనలో ఉన్న మాజీ మంత్రికి మధ్య నెలకొన్న విభేదాల నేపథ్యంలో ఈ స్థానంపై స్పష్టత రావాల్సి ఉంది.

ఉత్తరాంధ్రలోని విజయనగరంతో పాటు రాయలసీమలో ఒక కార్పొరేషన్‌, అలాగే కాకినాడ మేయర్ పదవి జనసేనకు దక్కే అవకాశం ఉందన్న టాక్ టీడీపీ వర్గాల్లో వినిపిస్తోంది. మొత్తానికి కొన్ని ప్రాంతాలలో స్థానిక ఎమ్మెల్యేల సమీకరణాలు, నాయకుల మధ్య ఉన్న రాజకీయ సమీకరణాలు ఈ సీట్ల సర్దుబాటును కొద్దిగా సంక్లిష్టం చేస్తునప్పటికీ, సమన్వయంతో అడుగులు వేయాలని ఇరు పార్టీల అధినాయకత్వాలు భావిస్తున్నాయి. మ‌రి ఈ స్థానిక పోరులో కూట‌మి పెద్ద‌లు సీట్ల స‌ద్దుబాటు ఏ విధంగా చేస్తారు..? జ‌న‌సేన డిమాండ్ల‌కు బాబు(Chandrababu) ఏ మేర‌కు దిగొస్తారు..? అన్ని అంశాలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.

Tags
AP Local Elections JanaSena TDP Pawan Kalyan Chandrababu Naidu Andhra Pradesh AP Politics NDA AP News
Recent Comments
Leave a Comment

Related News