మిథున్, అవినాష్ రెడ్డిల అరాచకం!

admin
Published by Admin — October 18, 2026 in Politics
News Image

వైసీపీ అధినేత జ‌గ‌న్ సొంత నియోజ‌క‌వ‌ర్గం పులివెందులలో అరాచ‌కం రాజ్య‌మేలింద‌నే చెప్పాలి. శ‌నివారం ఉద‌యం 11 గంట‌లకు ప్రారంభ మైన ఉద్రిక్త‌త‌లు.. రాత్రి వ‌ర‌కు కొన‌సాగుతూనే ఉన్నాయి. స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో నామినేష‌న్ ప‌ర్వం కొన‌సాగుతున్న స‌మ‌యంలో వైసీపీ వ‌ర్సెస్ టీడీపీ నేత‌ల మ‌ధ్య తీవ్ర ఘ‌ర్ష‌ణ‌ల‌కు రాయ‌చోటి, పుంగ‌నూరు శుక్ర‌వారం వేదిక‌గా.. శ‌నివారం ఏకంగా పులివెందుల సెంట్రిక్‌గా ఇరు ప‌క్షాలు ప‌రస్ప‌ర దాడులు చేసుకున్నాయి. రాళ్లురువ్వుకోవ‌డం నుంచి క‌ర్రలు, క‌త్తుల‌తోనూ దాడులు చేసుకున్నాయి. దీంతో పోలీసులు భారీ సంఖ్య‌లో మోహ‌రించి అదుపు చేసే ప్ర‌య‌త్నం చేసినా ఎక్క‌డా ఫ‌లించ‌లేదు.

ఏకంగా ఎస్పీపై..

జిల్లా పోలీసు అధికారి.. జిల్లా మొత్తానికి శాంతి భ‌ద్ర‌త‌ల‌కు బాధ్య‌త వ‌హించే అధికారి ఎస్పీ. అలాంటి క‌డ‌ప ఎస్పీని సైతం వైసీపీ కార్య‌క‌ర్త‌లు విడిచి పెట్ట‌లేదు. ఉద‌యం నుంచి కొన‌సాగిన ర‌ణ‌రంగాన్ని అదుపు చేసేందుకు డీఎస్పీ ప్ర‌య‌త్నించినా.. ఫ‌లితం రాక‌పోవ‌డంతో డీజీపీ ఆదేశాల మేర‌కు ఎస్పీ న‌చికేత్ విశ్వ‌నాథ్‌.. పులివెందుల‌కు శ‌నివారం సాయంత్రం చేరుకున్నారు. అయితే.. ఆయ‌న వ‌స్తున్న‌ట్టు ముందుగానే స‌మాచారం అందుకున్న వైసీపీ కార్య‌క‌ర్త‌లు.. మ‌ళ్లీ రెచ్చిపోయారు. పోలీసులు ప‌దే ప‌దే హెచ్చ‌రిక‌లు చేసినా ప‌ట్టించుకోలేదు. అంతేకాదు.. గాలిలోకి కాల్పులు జ‌రిపినా.. కూడా వెన‌క్కి త‌గ్గ‌లేదు.

ఈ ఘ‌ట‌న‌లో ఎస్పీ గాయ‌ప‌డ‌లేదు కానీ.. వైసీపీ కార్య‌క‌ర్త‌లు సృష్టించిన ర‌ణ‌రంగాన్ని మాత్రం ఆయ‌న ప్ర‌త్య‌క్షంగా వీక్షించారు. ఈ స‌మ‌యం లో ఇత‌ర పోలీసు సిబ్బంది.. ఆయ‌న‌కు ర‌క్ష‌ణ‌గా నిలిచారు. ఇదేస‌మ‌యంలో టియ‌ర్ గ్యాస్ ప్ర‌యోగించి ఆందోళ‌న కారుల‌ను చెల్లాచెదురు చేసే ప్ర‌య‌త్నం చేశారు. అక్క‌డి నుంచి ఎస్పీ.. తిరిగి వెళ్లిపోవాల‌న్న డిమాండ్లు కూడా వినిపించాయి. కాగా.. ఈ మొత్తం వ్య‌వ‌హారానికి క‌డప ఎంపి.. వైసీపీ నాయ‌కుడు అవినాష్ రెడ్డి కార‌ణ‌మ‌ని పోలీసులు భావిస్తున్నారు. శుక్ర‌వారం రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి పుంగ‌నూ రులో అరాచకం సృష్టించేందుకు ప్ర‌య‌త్నించార‌ని.. ఇప్పుడు క‌డ‌ప ఎంపి అవినాష్ కూడా అదే పంథాలో ముందుకు సాగుతున్నార‌ని టీడీపీ నేత‌లు నిప్పులు చెరిగారు.

అప్ర‌క‌టిత క‌ర్ఫ్యూ..

పులివెందుల‌లో శ‌నివారం జ‌రిగిన ఘ‌ర్ష‌ణ‌ల నేప‌థ్యంలో పోలీసులు భారీ సంఖ్య‌లో ఈ నియోజ‌క‌వ‌ర్గాన్ని చుట్టుముట్టారు. వ్యాపార సంస్థ‌లు మూత‌బ‌డ్డాయి. సాయంత్రం వేళ చిరు వ్యాపారాలు చేసుకునే వారు సైతం బ‌య‌ట‌కు రాలేదు. దీంతో పులివెందుల స‌హా.. స‌మీపంలోని అన్ని ప్రాంతాల్లోనూ అప్ర‌క‌టిత క‌ర్ఫ్యూ వాతావ‌ర‌ణం ఏర్ప‌డింది. వైసీపీ నాయ‌కుల‌ను పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. అయితే.. అప్ప‌టికే జ‌ర‌గాల్సిన ఘోరాలు జ‌రిగిపోయాయ‌ని అంటున్నారు. మ‌రోవైపు.. టీడీపీ నాయ‌కుల‌ను కూడా పోలీసులు నియంత్రించారు. మొత్తంగా పులివెందుల ఇప్పుడు ఉద్రిక్త‌త‌ల మ‌ధ్య కొన‌సాగుతోంది.

Tags
Mithun Reddy avinash reddy atrocities
Recent Comments
Leave a Comment

Related News