మోడీ భ‌యం వీడ‌లేదా.. జ‌గ‌న్ స‌ర్ ..!

News Image

వైసీపీ అధినేత జ‌గ‌న్ విష‌యంలో ప్ర‌త్య‌ర్థులు, ప్ర‌త్య‌ర్థి పార్టీల నాయ‌కులు కూడా.. కీల‌క విమ‌ర్శ‌లు చేస్తున్న విష‌యం తెలిసిందే. వీటిలో ప్ర‌ధానంగా కేంద్రంలోని న‌రేంద్ర మోడీ అంటే జ‌గ‌న్ హ‌డ‌లి పోతార‌ని.. ఆయ‌నంటే భ‌యం ఉంద‌ని ప‌లు సంద‌ర్భాల్లో టీడీపీ నాయ‌కులు విమ‌ర్శించారు. ఇక‌, ఈ విష‌యంపై జ‌గ‌న్ ఏనాడూ బ‌హిరంగ విమ‌ర్శ‌లు చేసింది లేదు. ప్ర‌త్య‌ర్థులు చేసిన కామెంట్ల‌కు ఆయ‌న కౌంట‌ర్లు ఇచ్చింది కూడా లేదు. విశాఖ ఉక్కు క‌ర్మాగారాన్ని ప్రైవేటు ప‌రం చేస్తున్నామ‌ని 2021లో ప్ర‌క‌టించిన‌ప్పుడు కూడా జ‌గ‌న్ మోడీపై ప‌న్నెత్తు మాట అన‌లేదు. 2019 ఎన్నిక‌ల స‌మ‌యంలో త‌మ‌కు ఎంపీలను ఇబ్బ‌డి ముబ్బ‌డిగా ఇస్తే.. ప్ర‌త్యేక హోదా సాధిస్తామ‌ని చెప్పిన జ‌గ‌న్‌.. ఆ ఎన్నిక‌ల్లో గెలిచిన త‌ర్వాత‌.. క‌నీసం ప్ర‌త్యేక హోదాపైనా కేంద్రాన్ని ప్ర‌శ్నించిన ప‌రిస్థితి కూడా లేదు. ఈ ప‌రిణామం కూడా ఆయ‌న కు మోడీ అంటే భ‌య‌మ‌నే వాద‌న‌ను బ‌ల‌ప‌రిచింద‌ని ప్ర‌తిప‌క్షాల నాయ‌కులు వ్యాఖ్యానించారు. ఆ త‌ర్వాత పోల‌వ‌రం నిధులు, మూడు రాజ‌ధానులు, హైకోర్టు మార్పు విష‌యంలోనూ.. కేంద్రం స‌హ‌క‌రించ‌క‌పోయినా.. జ‌గ‌న్ మోడీపై ఏమీ అన‌లేక పోయారు. అలానే.. కేంద్రం నుంచి నిధుల రాక త‌గ్గిపోయినా.. ఆయ‌న ప‌ట్టించుకోలేదు. ఈ ప‌రిణామాల‌తో ప్ర‌తిప‌క్షాలు మ‌రింత ఎక్కువ‌గా జ‌గ‌న్‌ను కార్న‌ర్ చేశాయి. వివేకానంద‌రెడ్డి దారుణ హ‌త్య కేసులో కీల‌క నిందితుల‌ను త‌ప్పించేందుకు కేంద్రం సాయం కోరుతున్నార‌ని.. ప్ర‌స్తుత సీఎం చంద్ర‌బాబు కూడా.. గ‌తంలో విమ‌ర్శ‌లు చేశారు. అదేవిధంగా త‌న‌పై ఉన్న అక్ర‌మాస్తుల కేసుల‌ను విచార‌ణ‌కు రాకుండా చూసుకునేందుకు కూడా మోడీపై ఎలాంటి వ్యాఖ్య‌లు చేయ‌డం లేద‌న్నారు. ఈ విష‌యంలో ఇత‌ర పార్టీల నాయ‌కులు కూడా ఇవే వ్యాఖ్య‌లు చేయ‌డం గ‌మ‌నార్హం. కేంద్రంలోని మోడీ స‌ర్కారుతో జ‌గ‌న్ మిలాఖ‌త్ అయ్యార‌న్న చ‌ర్చ జోరుగానే సాగింది. క‌ట్ చేస్తే.. ఇప్పుడు కూడా ఇదే వైఖ‌రి ప్ర‌ద‌ర్శించారంటూ..జ‌గ‌న్‌పై వామ‌ప‌క్షాలు స‌హా .. సొంత సోద‌రి, కాంగ్రెస్ ఏపీ చీఫ్‌ ష‌ర్మిల మ‌రోసారి వ్యాఖ్యానించ‌డం గ‌మ‌నార్హం. పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న స‌మ‌స్య‌పై చ‌ర్చించేందుకు రావాల‌న్న త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి స్టాలిన్ ఆహ్వానాన్ని జ‌గ‌న్ ప‌క్క‌న పెట్టారు. ఇదేస‌మ‌యంలో కేంద్రంలోని మోడీస‌ర్కారు కు ఆయ‌న మెత్త‌గా లేఖ సంధించారు. డీలిమిటేష‌న్ ద్వారా ఎవ‌రికీ ఎలాంటి అన్యాయం జ‌ర‌గ‌కుండా చూడాల‌ని పేర్కొంటూ..మూడు పేజీల లేఖ సంధించారు. దీనిని గ‌మ‌నించిన వామ‌ప‌క్షాలు.. సోద‌రి ష‌ర్మిల సైతం.. జ‌గ‌న్‌కు ఇంకా మోడీ అంటే భ‌యం పోలేద‌ని.. అందుకే.. డీలిమిటేష‌న్‌పైనా ఆయ‌న మోడీకి స‌న్నాయి నొక్కులు నొక్కుతున్నార‌ని వ్యాఖ్యానించ‌డం గ‌మ‌నార్హం.

Related News