ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) వ్యాప్తంగా ఉత్కంఠ రేపిన పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ ప్రక్రియ విజయవంతంగా ముగిసింది. ఉదయం 7 గంటలకు మొదలైన ఈ ఓటింగ్ పర్వం, సాయంత్రం 5 గంటల వరకు కొనసాగింది. పోలింగ్ వేళల్లో ఓటర్లు చూపిన ఉత్సాహం ఒకెత్తైతే, కొన్ని ప్రాంతాల్లో నమోదైన భారీ పోలింగ్ శాతాలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.
తొలి గంటల్లో పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరి తమ హక్కును వినియోగించుకున్నారు. మధ్యాహ్నం వేళ ఎండ తీవ్రత కారణంగా ఓటింగ్ వేగం కొంత మందగించినా, సాయంత్రం అయ్యేసరికి మళ్లీ క్యూలైన్లు కిటకిటలాడాయి. ముఖ్యంగా పులివెందుల(Pulivendula) లాంటి కొన్ని సున్నితమైన ప్రాంతాల్లో అక్కడక్కడా చిన్నపాటి వివాదాలు, తోపులాటలు మినహా రాష్ట్రవ్యాప్తంగా ప్రశాంత వాతావరణంలోనే పోలింగ్ ముగియడం ఊరటనిచ్చే అంశం. సమయం ముగిసేసరికి క్యూలో ఉన్న ప్రతి ఒక్కరికీ అధికారులు ఓటు వేసే అవకాశం కల్పించారు.
ఇక ఈ ఎన్నికల్లో కొన్ని ప్రాంతాలు ఓటింగ్ శాతంలో ఊహించని రికార్డులు సృష్టించాయి. మధ్యాహ్నం 3 గంటల సమానికే రాష్ట్రవ్యాప్తంగా సగటున 48 శాతానికి పైగా ఓటింగ్ నమోదుకాగా.. కర్నూలు(Kurnool) జిల్లా గూడూరు నగర పంచాయతీ ఏకంగా 73.96 శాతం ఓటింగ్‌తో రాష్ట్రంలోనే నంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకుంది. దీనికి తక్కువ ఏమీ లేకుండా ప్రకాశం జిల్లా చీమకుర్తి (73.64%), కనిగిరి (73.20%), నగరి (71.78%), బద్వేలు (71.52%) ప్రాంతాల్లో జనం భారీ సంఖ్యలో పోలింగ్ బూత్‌లకు తరలివచ్చారు.
మరోవైపు, పల్లెలు, చిన్న పట్టణాల్లో ఓటర్లు ఓటింగ్ పట్ల చూపిన ఆసక్తి.. మహా నగరాల్లో మాత్రం కనిపించలేదు. విశాఖపట్నం (GVMC) పరిధిలో కేవలం 39.72 శాతం మాత్రమే ఓట్లు పోలవడంతో, రాష్ట్రంలోనే అత్యల్ప పోలింగ్ నమోదైన నగరంగా విశాఖ నిలిచింది. కాగా, పోలింగ్ ముగియడంతో అధికారులు బ్యాలెట్ బాక్సులను అత్యంత భద్రత మధ్య స్ట్రాంగ్‌రూమ్‌లకు తరలిస్తున్నారు. అవసరమైన చోట్ల సోమవారం రీపోలింగ్ నిర్వహించనుండగా, నవంబర్ 3న ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. మరి ఈ రికార్డు స్థాయి ఓటింగ్ ఎవరి కొంప ముంచనుంది? ఎవరిని గెలిపించనుంది? అన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది.