జగన్ గుట్టు విప్పనంటోన్న సాయిరెడ్డి!

admin
Published by Admin — November 27, 2026 in Politics
News Image
బెంగళూరులోని యలహంకలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉంటున్న ప్యాలెస్ విషయంలో గత కొన్ని రోజులుగా పెద్ద చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ భవనంలో తనకూ భాగం ఉందని వాదిస్తున్న జగన్ సోదరి షర్మిళ.. అక్కడ తన కుమార్తె పెళ్లి చెయ్యాలని గట్టిగా ప్రయత్నించారు కానీ సాధ్యపడలేదు.
 
ఐతే ఈ ప్యాలెస్ కు సంబంధించి చట్టపరంగా షర్మిళకు ఎలాంటి యాజమాన్య హక్కులు లేవని జగన్ వర్గం వాదిస్తుండగా.. వైఎస్ ఉండగా అందులో షర్మిళకు కూడా భాగం ఉందని చెప్పారని, ఆమెకు వాటా ఇవ్వాల్సిన నైతిక బాధ్యత జగన్ మీద ఉందని తన వర్గం వాదిస్తోంది. ఇందులో ఎవరి వాదన కరెక్ట్ అని చెప్పడం కష్టం అవుతోంది. ఐతే వైఎస్ కుటుంబానికి, జగన్మోహన్ రెడ్డికి ఒకప్పుడు ఎంతో సన్నిహితుడైన మాజీ ఎంపీ.. ఇటీవలే పీఆర్పీ అనే కొత్త పార్టీ పెట్టిన విజయసాయి రెడ్డి స్పందించారు.
 
వైఎస్ కుటుంబానికి సీఏగా వారి ఆస్తి వ్యవహారాలను చాలా ఏళ్ల పాటు విజయసాయి చూసిన నేపథ్యంలో యల్లం ప్యాలెస్ గురించి ఆయన ఏమంటారా అని అందరూ ఆసక్తి కనబరుస్తున్నారు.
ఐతే యలహంక ప్యాలెస్ గురించి తనకు మొత్తం తెలుసు అంటూనే దాని వివరాలు వెల్లడించలేనని సాయిరెడ్డి తేల్చేశారు. ఆస్తి పంపకాల విషయంలో ఏం జరిగిందో.. వైఎస్ ఉద్దేశమేంటో ఆయన కుటుంబ సభ్యులతో పాటు తనకు, వైఎస్ మిత్రుడు కేవీపీ రామచంద్రరావుకు మాత్రమే తెలుసని సాయిరెడ్డి అన్నారు.
 
యలహంక ప్యాలెస్ విషయంలో వేరే వ్యక్తులు, మీడియా వాళ్ళు రకరకాల వాదనలు చేస్తున్నారని.. కానీ అవేవీ వాస్తవాలు కావని ఆయన తేల్చేశారు. నిజమేంటో కొద్ది మందికే తెలుసని, అందులో తాను ఒకడినని ఆయన చెప్పారు. ఐతే వైఎస్ కుటుంబానికి నమ్మకమైన సీఏగా పనిచేసిన తాను.. ఇప్పుడు ఆ వివరాలు చెప్పడం నైతికంగా కరెక్ట్ కాదని.. కాబట్టి మీడియా వాళ్ళు ఎంత అడిగినా దాని గురించి మాట్లాడలేనని సాయిరెడ్డి తేల్చేశారు. బెంగళూరులోని ప్రైమ్ ఏరియాలో 14 ఎకరాల భారీ విస్తీర్ణంలో యూరోపియన్ స్టైల్లో, ఎంతో విలాసవంతంగా ఈ ప్యాలెస్ నిర్మించారు. 2024 ఎన్నికల్లో ఓడిపోయాక జగన్ కుటుంబంతో కలిసి ఈ ఇంట్లోనే ఉంటున్నారు.
Tags
jagan vijayasaireddy sharmila property disputes
Previous News Next News
Recent Comments
Leave a Comment

Related News