కర్ణాటక లో ఇక ఒకటే టికెట్ రేటు

admin
Published by Admin — March 07, 2025 in Movies
News Image

కర్ణాటక సినిమా ప్రియులకు గుడ్ న్యూస్ చెప్పారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య. కర్ణాటక న్యూస్‌తో మనకు ఏం సంబంధం అనొచ్చు. కానీ అక్కడ సినిమాలకు మహరాజ పోషకులు తెలుగు వాళ్లే. బెంగళూరులో తెలుగు వాళ్లు ఎన్ని లక్షల మంది ఉన్నారో.. అక్కడ మన సినిమాలు ఎలా ఆడతాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

ఫ్లెక్సీ ప్రైసింగ్‌తో మన వాళ్ల జేబుల్ని గుల్ల చేసేయడమూ జరుగుతుంటుంది. ఇలా దోపిడీకి అవకాశం లేకుండా అన్ని థియేటర్లకూ ఒకటే రేటు పెట్టాలని సిద్ధరామయ్య ప్రభుత్వం నిర్ణయించింది. సింగిల్ స్క్రీన్, మల్టీప్లెక్స్ అని తేడా లేకుండా ఏకమొత్తంగా రూ.200 రేటుతో టికెట్లు అమ్మేలా కొత్త విధానం తీసుకొస్తున్నట్లు సిద్ధరామయ్య ప్రభుత్వం తాజాగా ప్రవేశపెట్టిన బడ్జెట్లో పేర్కొనడం విశేషం.

బడ్జెట్లో ఇలా టికెట్ల రేట్ల గురించి ప్రతిపాదనలు పెట్టి.. దాని గురించి సభలో చర్చించడం విశేషమే. ప్రస్తుతం ఎక్కడైనా సింగిల్ స్క్రీన్లలో టికెట్ల ధరలు తక్కువగా, అందుబాటులో ఉంటాయి. మల్టీప్లెక్సుల్లో రేటు ఎక్కువ అనే అభిప్రాయం ఉంది. ఇకపై కర్ణాటకలో అన్ని థియేటర్లలో ఒకటే రేటు ఉండేలా కొత్త విధానం తెస్తామని.. ఏ షోకైనా అన్ని థియేటర్లలో రూ.200 రేటే ఉంటుందని ముఖ్యమంత్రి తెలిపారు.

సామాన్యులకు కూడా సినిమాను అందుబాటులోకి తేవాలనే ఉద్దేశంతోనే ఇలా చేస్తున్నామని.. అదే సమయంలో సినీ పరిశ్రమకు కూడా ఇదే మేలు చేస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. మరోెవైపు కన్నడ సినిమాలను ప్రమోట్ చేసేందుకు ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వమే ఒక ఓటీటీ సంస్థను తీసుకురాబోతున్నట్లు కూడా సిద్ధరామయ్య వెల్లడించడం విశేషం.

మైసూరులో ఒక ఫిలిం సిటీ నిర్మించేందుకు 150 ఎకరాల భూమిని కేటాయిస్తున్నట్లు కూడా సిద్ధరామయ్య తెలిపారు. మిగతా విషయాల మాటెలా ఉన్నా.. టికెట్ల రేట్ల గురించి చేసిన ప్రకటన మాత్రం కర్ణాటక సినీ ప్రియులకు ఉత్సాహాన్నిచ్చేదే.

Recent Comments
Leave a Comment

Related News