ఆ నటుడి రాత మార్చేసిన రీ రిలీజ్

admin
Published by Admin — March 10, 2025 in Movies
News Image

ఒక్క సినిమాతో రాత్రికి రాత్రి నటుడి జీవితం మారిపోతుంటుంది. అసలు పరిచయం లేని నటులే కాదు.. ఫేమ్ కోల్పోయి ఖాళీ అయిపోయిన ఆర్టిస్టులు సైతం ఒక్క సినిమాతో మళ్లీ కెరీర్లను గాడిలో పెట్టుకోవచ్చు. ‘యానిమల్’ అనే సినిమాకు ముందు బాబీ డియోల్ పరిస్థితి ఏంటో అందరికీ తెలుసు. అవకాశాల కోసం నిర్మాతల ఇంటి ముందు నిలబడే పరిస్థితి వచ్చిందని.. అయినా తనకు పని దొరకలేదని బాబీ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పుకున్నాడు.

అలాంటి నటుడు ఇప్పుడు డేట్లు సర్దుబాటు చేయలేక క్రేజీ ప్రాజెక్టులను వదులుకుంటున్నాడు. బాలీవుడ్లో ఇలా మరో నటుడు బిజీ అయ్యే సంకేతాలు కనిపిస్తున్నాయి. అతను నటించిన ఓ పాత చిత్రం అనూహ్యంగా తన రాతను మార్చేసింది. ఆ నటుడే.. హర్షవర్ధన్ రాణె. పలు తెలుగు చిత్రాల్లోనూ నటించిన హర్షవర్ధన్.. ఎప్పుడో 2016లో నటించిన ‘సనమ్ తేరి కసమ్’ ఇటీవలే రీ రిలీజై సెన్సేషన్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే.

ఫస్ట్ రిలీజ్ కంటే రీ రిలీజ్‌లో ఏకంగా 4 రెట్లు, అంటే దాదాపు రూ.20 కోట్ల వసూళ్లు వసూలు చేసి సంచలనం రేపింది ‘సనమ్ తేరి కసమ్’. ఈ దెబ్బతో హర్షవర్ధన్‌కు మాంచి డిమాండ్ ఏర్పడింది బాలీవుడ్లో. ‘సనమ్ తేరి కసమ్’కు సీక్వెల్ కూడా రెడీ అవుతుండగా.. అందులో అతనే హీరో. అంతే కాక ‘రేస్-4’ లాంటి క్రేజీ సీక్వెల్లోనూ హర్ష అవకాశం దక్కించుకున్నాడు.

సైఫ్ అలీ ఖాన్ ఇందులో హీరోగా నటిస్తుండగా.. మెయిన్ విలన్‌గా హర్షవర్ధన్ ఎంపికయ్యాడట. సైఫ్ లీడ్ రోల్ చేసిన ‘రేస్’ బ్లాక్ బస్టర్ అయింది. ‘రేస్-2’ కూడా బాగానే ఆడింది. ‘రేస్-3’లో మాత్రం సల్మాన్ హీరోగా నటించగా.. అది డిజాస్టర్ అయింది. ఇప్పుడు ‘రేస్-4’లో మళ్లీ సైఫ్ హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాపై భారీ అంచనాలుండగా.. ఇలాంటి క్రేజీ ప్రాజెక్టులో విలన్ పాత్ర పోషించనుండడంతో హర్షవర్ధన్ దశ తిరిగినట్లే కనిపిస్తోంది.

Previous News Next News
Recent Comments
Leave a Comment

Related News