ఏపీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల‌కు ఆట‌ల పోటీలు.. వైసీపీకీ ఆహ్వానం!

admin
Published by Admin — March 17, 2025 in Politics
News Image

ఏపీ అసెంబ్లీ స‌మావేశాలు ఆఖ‌రి ద‌శ‌కు చేరుకున్నాయి. ఈ నేప‌థ్యంలోనే నిత్యం రాజ‌కీయాల్లో బిజీగా ఉంటూ ఎంతో ఒత్తిడిని ఎదుర్కొనే ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల‌కు కాస్త రిలీఫ్ అందించేందుకు ఆట‌ల పోటీలు నిర్వ‌హించాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. మంగ‌ళ‌వారం నుండి మూడు రోజుల పాటు ప్ర‌జా ప్ర‌తినిధుల‌కు విజ‌య‌వాడ‌లోని ఇందిరాగాంధీ మున్పిప‌ల్ మైదానంలో క్రీడ, సాంస్కృతిక పోటీలు జ‌ర‌గ‌బోతున్నాయి. ఇందుకు సంబంధించిన ఏర్పాట్ల‌ను ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు, ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకట్రావు ద‌గ్గ‌రుండి చూసుకుంటున్నారు.

శాసనసభ్యులందరికీ ఇన్విటేష‌న్ పంపారు. వైసీపీ నేత‌ల‌కు కూడా ఆహ్వానాలు అందాయి. మొత్తం 12 విభాగాల్లో ఆటల పోటీలు నిర్వ‌హించ‌బోతున్నారు. ఇందులో క్రికెట్, షటిల్‌ బ్యాడ్మింటన్,టెన్నిస్, టేబుల్‌ టెన్నిస్, క్యారమ్స్, కబడ్డీ, టెన్నికాయిట్, త్రోబాల్, వాలీబాల్, టగ్‌ ఆఫ్‌ వార్, అథ్లెటిక్స్‌ పోటీలు ఉన్నాయి. అయితే మూడు రోజుల పాటు ప్ర‌భుత్వం నిర్వహించ‌నున్న ఈ క్రీడా పోటీలకు మంచి స్పంద‌న ల‌భిస్తోంది. ఇప్ప‌టికే శాస‌న‌స‌భ‌, మండ‌లి నుంచి 173 మంది ఈ క్రీడా పోటీల్లో పాల్గొనేందుకు పేరు నమోదు చేసుకున్నారు.

ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు, మంత్రి నారా లోకేష్‌, ఉపసభాపతి రఘురామకృష్ణరాజు వంటి వారు కూడా ఆట‌ల పోటీల్లో పాల్గొనేందుకు త‌మ పేర్లు ఇచ్చారు. చంద్రబాబు బ్యాడ్మింటన్‌ పోటీల్లో పాల్గొనే ఛాన్స్ ఉంద‌ని తెలుస్తోంది. అలాగే మంత్రి నారా లోకేష్ క్రికెట్, వాలీబాల్, షటిల్‌లో పాల్గొంటారు. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు షటిల్, వాలీబాల్‌ ఆడతానని పేరు నమోదు చేయించుకోగా.. మంత్రి అచ్చెన్నాయుడు త్రోబాల్, క్రికెట్, వాలీబాల్, టగ్‌ ఆఫ్‌ వార్, షటిల్‌ పోటీల్లో పేర్లు ఇచ్చారు.

ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు, ఎమ్మెల్యే పార్థసారథి, ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామగోపాల్‌రెడ్డి 100 మీటర్ల పరుగు పందెంలో పేర్లు న‌మోదు చేసుకున్నారు. అలాగే మహిళా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా క్రీడా పోటీల్లో ఉత్సాహం చూపిస్తున్నారు. మంత్రులు వంగలపూడి అనిత, సంధ్యారాణి, సవిత.. ఎమ్మెల్యే పరిటాల సునీత, గౌరు చరితారెడ్డి త‌దిత‌రులు క్యారమ్స్, షటిల్‌ బ్యాడ్మింటన్, టెన్నిస్, 100 మీటర్ల పరుగు పందెం, షాట్‌పుట్, టెన్నికాయిట్, త్రోబాల్, టగ్‌ ఆఫ్‌ వార్ వంటి క్రీడ‌ల్లో పాల్గొన‌బోతున్నారు. వైసీపీ ఎమ్మెల్సీలు మాధవరావు, వంకా రవీంద్రనాథ్‌ 100 మీటర్ల పరుగు పందెం, త్రోబాల్‌లో పాల్గొన‌బోతున్నారు. క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి టెన్నికాయిట్, త్రోబాల్, వాలీబాల్, టగ్‌ ఆఫ్‌ వార్‌, షటిల్ క్రీడల్లో పాల్గొననున్నారు. కాగా, అన్ని క్రీడ‌ల్లో క్రికెట్ ముందు వ‌రుస‌లో ఉంది. క్రికెట్ ఆడేందుకు మొత్తం 31 మంది ప్ర‌జా ప్ర‌తినిధులు పేర్లు న‌మోదు చేసుకోవ‌డం విశేషం.

Previous News Next News
Recent Comments
Leave a Comment

Related News