ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో కాంగ్రెస్ షాకింగ్ నిర్ణయం

admin
Published by Admin — March 10, 2025 in Politics, Telangana
News Image

తెలంగాణలో జరగనున్న ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి అధికార కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్థుల్ని ప్రకటించటం తెలిసిందే. ఎమ్మెల్యే కోటాలో ఎన్నుకునే ఎమ్మెల్సీలకు సంబంధించి మొత్తం ఐదు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో అధికార కాంగ్రెస్ కు నాలుగు స్థానాల్లో తన అభ్యర్థుల్ని గెలుచుకునే అవకాశం ఉంది. ఈ కారణంతో నాలుగు స్థానాలకే పోటీ చేయాలని పార్టీ డిసైడ్ చేసింది.

ఇందులో మూడు స్థానాల్ని తమ పార్టీకి కేటాయించిన అధినాయకత్వం.. ఒక స్థానాన్ని మాత్రం మిత్రులైన సీపీఐకు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. ఎమ్మెల్సీ అభ్యర్థుల విషయానికి వస్తే అద్దంకి దయాకర్ (ఎస్సీ).. శంకర్ నాయక్ (ఎస్టీ).. విజయశాంతి (బీసీ)లకు అవకాశం ఇచ్చిన అధినాయకత్వం పార్టీ చరిత్రలో తొలిసారి ఓసీని ఒక్కరిని కూడా ఎంపిక చేయకుండా జాబితాను ప్రకటించినట్లుగా చెప్పాలి.

సాధారణంగా ఎమ్మెల్సీ ఎన్నికలకు అభ్యర్థుల ఎంపికలో ఒక్క స్థానాన్ని అయినా ఓసీలకు కేటాయిస్తూ నిర్ణయం తీసుకోవటం ఆనవాయితీగా వస్తోంది. అయితే.. ఒకస్థానం మిత్రపక్షం సీపీఐకు ఇవ్వాల్సి రావటం.. ఇటీవల కాలంలో వెనుకబడిన వర్గాలకు పెద్దపీట వేస్తామని గొప్పలు చెప్పుకుంటున్న వేళ.. ఉన్నమూడు స్థానాల్లో ఒకటి అగ్రవర్ణాలకు కేటాయిస్తే పార్టీ ఇమేజ్ దెబ్బ తింటుందని భావించారు. ఇదే.. ఓసీ అభ్యర్థులకు అవకాశం ఇవ్వకుండా అడ్డుకున్నట్లుగా చెబుతున్నారు.

ఓ వైపు బీసీ కులగణ పూర్తి చేసి.. దానికి చట్టబద్ధత కోసం ప్రయత్నాలు చేస్తుండటం.. మరోవైపు ఎస్సీ వర్గీకరణ హామీని అమలు చేసిన నేపథ్యంలో వెనుకబడిన వర్గాలకు పార్టీ అండగా నిలుస్తుందన్న సందేశాన్ని ఇవ్వటమే లక్ష్యంగా అభ్యర్థుల ఎంపిక ఉందని చెబుతున్నారు. ఈసారి అభ్యర్థుల ఎంపికలో పార్టీకి సుదీర్ఘంగా సేవలు అందిస్తున్న వారికి.. పార్టీని నమ్ముకున్న వారికి టికెట్ల కేటాయింపు ఇవ్వాలన్న ముఖ్యమంత్రి రేవంత్ వినతికి పార్టీ అగ్ర నాయకత్వం విలువ ఇచ్చినట్లుగా చెబుతున్నారు.

మొత్తంగా తాను నమ్మకున్న బలహీన వర్గాలకు రేవంత్ సర్కారు అండగా ఉంటుందన్న మాటలే కాదు.. తమ చేతలు ఇదే విషయాన్ని చెబుతున్నట్లుగా కాంగ్రెస్ పార్టీ తాజా నిర్ణయం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది

Tags
bold decisionfirst timeno mlc seat for jagga reddyoc communityTelangana congress
Recent Comments
Leave a Comment

Related News