నిరూపిస్తే ఆ ఆస్తులు రాసిస్తా.. రేవంత్‌కు కేటీఆర్ స‌వాల్‌.!

admin
Published by Admin — September 17, 2026 in
News Image

తెలంగాణ రాజకీయాల్లో ఆస్తుల రగడ మరోసారి తారాస్థాయికి చేరింది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్(KCR) కుటుంబ ఆస్తులపై సీఎం రేవంత్‌రెడ్డి అసెంబ్లీ వేదిక‌గా చేసిన ఆరోపణలపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కేసీఆర్‌పై నిరాధార ఆరోపణలు మాని, దమ్ముంటే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని ఆయన సవాల్ విసిరారు. ఒకవేళ ఆరోపణలు నిజమని తేలితే కేసీఆర్‌కు ఉన్న ఆస్తులన్నింటినీ ప్రభుత్వానికి రాసిచ్చేస్తామని సంచలన ప్రకటన చేశారు.

తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేటీఆర్(KTR) మాట్లాడుతూ రేవంత్‌రెడ్డి తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో కేసీఆర్‌కు వెయ్యి ఎకరాల ఫామ్‌హౌస్‌ ఉందని కొన్నాళ్లుగా పెద్ద ఎత్తున తప్పుడు ప్రచారం చేశారని, కానీ అసెంబ్లీలో మాత్రం కేవలం 67 ఎకరాలే ఉన్నాయని సీఎం స్వయంగా అంగీకరించారని గుర్తుచేశారు. ప్రజలను తప్పుదోవ పట్టించేలా మాట్లాడినందుకు రేవంత్‌రెడ్డి వెంటనే బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కేసీఆర్‌కు 933 ఎకరాల భూమి ఉందంటూ ప్రభుత్వం నిరూపించి చూపాలని, అలా నిరూపిస్తే ఆ భూములన్నీ అప్పగిస్తామని సవాల్‌ విసిరారు. కేసీఆర్ ది వెయ్యేళ్ల నాటి భూస్వామ్య కుటుంబమని, తాతల నాటి నుంచి తమకు వందల ఎకరాల ఆస్తులు ఉన్నాయని స్పష్టం చేశారు.

రేవంత్‌రెడ్డి ఆస్తులపై కేటీఆర్ ప్రశ్నల వర్షం..
ఇదే సమయంలో సీఎం రేవంత్‌రెడ్డి(Revanth Reddy) సంపాదనపై కేటీఆర్ పలు సూటి ప్రశ్నలు సంధించారు. తాను అమెరికాలో ఉద్యోగం చేసి కష్టపడి సంపాదించుకున్నానని చెప్పుకునే రేవంత్‌రెడ్డికి.. జూబ్లీహిల్స్‌లో అంతపెద్ద ప్యాలెస్ లాంటి ఇల్లు ఎలా వచ్చిందని నిలదీశారు. రేవంత్‌రెడ్డి సీఎం అయిన తర్వాత ఆయన చిన్నాన్న ఆత్మహత్య చేసుకోవడానికి గల అసలు కారణాలు ఏమిటో బహిరంగంగా చెప్పాలని డిమాండ్ చేశారు. అలాగే, ఆయన తమ్ముళ్లు ఏరోస్పేస్ కంపెనీలను ఏ విధంగా ఏర్పాటు చేశారో రాష్ట్ర ప్రజలకు వివరణ ఇవ్వాలని కోరారు. కేవలం తమ పార్టీ నేతలపై ఇష్టానుసారంగా బురదజల్లేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు చేస్తోందని, ప్రతి సంక్షేమ పథకంలోనూ భారీగా స్కామ్‌లు జరుగుతున్నాయని కేటీఆర్ ఆరోపించారు. ప్ర‌స్తుతం కేటీఆర్ చేసిన ఈ కామెంట్స్ తెలంగాణ రాష్ట్ర రాజ‌కీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.

Tags
KTR Revanth Reddy Telangana Politics KCR BRS Congress Hyderabad
Previous News Next News
Recent Comments
Leave a Comment

Related News

Latest News