నా అన్వేష్‌ పై పోలీసు కేసు.. అరెస్ట్ త‌ప్ప‌దా..?

admin
Published by Admin — May 04, 2025 in Politics, Telangana
News Image

ప్ర‌పంచ యాత్రికుడు, ప్ర‌ముఖ యూట్యూబర్ అన్వేష్‌ పై పోలీసు కేసు న‌మోదైంది. హైదరాబాద్ మెట్రోలో బెట్టింగ్ యాప్‌ల ప్రచారానికి అనుమతులు ఇచ్చే నెపంతో తెలంగాణ డీజీపీ జితేందర్, హైదరాబాద్ మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, సీనియర్ ఐఏఎస్ అధికారులు శాంతికుమారి, దానకిశోర్, వికాస్‌రాజ్ తదితరులు రూ.300 కోట్లు అక్రమంగా ఆర్జించారని ఆరోపిస్తూ అన్వేష్ తన యూట్యూబ్ ఛానెల్‌లో ఓ వీడియోను పోస్ట్ చేశాడు.

అయితే ఈ వీడియోలో అన్వేష్ ప్ర‌స్తావించిన స‌మాచారం పూర్తిగా అవాస్త‌వమని సైబర్ క్రైమ్‌ పోలీసులు గురించారు. ఎటువంటి ఆధారాలు లేకుండా రాష్ట్ర ప్రభుత్వంలోని ఉన్నతాధికారులపై త‌ప్పుడు ఆరోపణలు చేస్తూ, అవాస్తవ సమాచారంతో కూడిన వీడియోను ప్రచారం చేస్తున్న కార‌ణంగా అన్వేష్‌పై సైబరాబాద్ సైబర్ క్రైమ్‌ పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేశారు.

సైబర్ క్రైమ్‌ పోలీస్ స్టేషన్‌కు చెందిన ఓ కానిస్టేబుల్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా అన్వేష్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదైంది. ప్రజల్లో గందరగోళం సృష్టించాలనే ఉద్దేశంతో ప్రభుత్వ అధికారులు, చట్టబద్ధమైన సంస్థల ప్రతిష్టను దెబ్బతీసేలా, పరువుకు భంగం కలిగించేలా అన్వేష్ వీడియో ఉంద‌ర‌ని ఫిర్యాదులో పేర్కొన్నారు. 300 కోట్ల లంచం తీసుకుని మూడు బెట్టింగ్‌ యాప్‌లను ప్రోత్సహించారంటూ కనీసం ఆధారాల్లేకుండా ప్ర‌భుత్వ అధికారుల‌ పేర్లు ప్రస్తావించార‌ని.. దేశానికి వ్యతిరేకంగానూ కొన్ని వ్యాఖ్యలున్నాయ‌న్నారు. అధికారుల విశ్వసనీయతను దెబ్బతీసేలా, ప్రభుత్వం మీద వ్యతిరేకత, ద్వేషాన్ని కలిగించేలా త‌ప్పుడు స‌మాచారంతో వీడియో పోస్ట్ చేసిన కంటెంట్ క్రియేటర్ అన్వేష్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు. ఇక ఈ కేసును పోలీసులు సీరియ‌స్‌గా తీసుకుంటే అన్వేష్ అరెస్ట్ అవ్వొచ్చ‌ని ప‌లువురు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

Tags
Hyderabad Cyber Crime Police Hyderabad police Latest news
Recent Comments
Leave a Comment

Related News