సాగు, తాగునీటి ప్రాజెక్టుల విషయంపై రోడ్డున పడి మాటలు అనుకోవడం వల్ల ఎవరికీ ప్రయోజనం ఉండదని సీఎం చంద్రబాబు అన్నారు. తెలంగాణ, ఏపీ రాష్ట్రాల ప్రజలు బయట వారు కాదని.. ఇద్దరూ నిన్నమొన్నటి వరకు కలిసిఉన్నవారేనని చెప్పారు. రాష్ట్రంలో సాగునీటి అవసరాలు, తాగు నీటి అవసరాలు ఇరు రాష్ట్రాలకూ ముఖ్యమేనన్నారు. ఈవిషయంలో గొడవలు పడడం వల్ల ఎవరికీ ఎలాంటి ప్రయోజనం చేకూరదని చెప్పారు.
తాజాగా మీడియాతో మాట్లాడిన సీఎం చంద్రబాబు.. సముద్రంలో కలిసి వృథాగా పోతున్న జలాలను వాడుకుని సమస్యలు పరిష్కరించేందుకు ముందుకు వస్తే.. స్వాగతిస్తామని చెప్పారు. రెండు తెలుగు రాష్ట్రాలకూ.. నీటి అవసరాలు ఉన్నాయన్న విషయం తనకు తెలుసునని అన్నారు. ప్రస్తుతం ఏపీలో ఉన్న పోలవరం ప్రాజెక్టుకు మాత్రమే కేంద్ర జల సంఘం నుంచి అనుమతి ఉందన్న ఆయన.. గోదావరి ద్వారా సముద్రంలో కలుస్తున్న వృథా జలాలను రెండు రాష్ట్రాలూ వాడుకునేలా ప్లాన్ చేద్దామన్నారు.
జలాల విషయంలో రోడ్డున పడితే.. ఎవరికీ ప్రయోజనం ఉండదని చంద్రబాబు చెప్పారు. గతంలో తాను ఎప్పుడూ తెలంగాణ నీటి ప్రాజెక్టులకు అడ్డు చెప్పలేదని అన్నారు. కృష్ణా జలాల్లో నీటి లభ్యత తక్కువగా ఉందని.. ఈ విషయం తెలిసి కూడా.. రగడకు దిగడం సరికాదన్నారు. కొత్తగా ట్రైబ్యునల్ ఏర్పడిన తర్వాత.. కేటాయింపుల మేరకు నడుచుకుందామన్నారు. అప్పటి వరకు ఇరు రాష్ట్రాలు ఎవరికి శక్తి మేరకు .. వారు ప్రాజెక్టులు కట్టుకుందామని తేల్చి చెప్పారు.
ముఖ్యంగా ప్రాజెక్టుల విషయంలో కలిసి కూర్చుని మాట్లాడుకుందామని తెలంగాణ సీఎం ను ఉద్దేశించి చంద్రబాబు సూచించారు. కూర్చుని మాట్లాడుకుంటే సమస్యలు పరిష్కారమవుతాయన్నారు. ఈ సందర్భంగా ఆయన బనకచర్లకు అడ్డు పడవద్దని సూచించారు. గతంలో తాను తెలంగాణ కట్టుకున్న కాలేశ్వరం ప్రాజెక్టు విషయంలో ఏనాడూ ఇబ్బంది పెట్టలేదని అన్నారు. ఇప్పటికైనా మించి పోయింది ఏమీ లేదని.. కూర్చుని మాట్లాడుకుందామని అన్నారు.