తెలంగాణ నీటి ప్రయోజనాలకు విరుద్ధంగా ఏపీలో గోదావరి- బనకచర్ల ప్రాజెక్టు కడుతున్నారని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆరోపిస్తోన్న సంగతి తెలిసిందే. ఆ ప్రాజెక్టు ప్రీ ఫీజుబిలిటీ రిపోర్ట్‌ను తిరస్కరించాలని జల్‌శక్తి మంత్రి సీఆర్ పాటిల్‌కు రేవంత్ విజ్ఞప్తి చేశారు. గోదావరి జల వివాదాల ట్రైబ్యునల్-1980 (జీడబ్ల్యూడీటీ), ఏపీ పునర్విభజన చట్టం-2014లకు విరుద్ధంగా ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని రేవంత్ ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే రేవంత్ వ్యాఖ్యలపై ఏపీ సీఎం చంద్రబాబు స్పందించారు.
సముద్రంలో కలిసిపోయే నీటి వాడకంపై సమస్య సృష్టించడం ఎంతవరకు సమంజసం అని చంద్రబాబు ప్రశ్నించారు. గోదావరి నీళ్లు రెండు రాష్ట్రాలు వాడుకుంటున్నాయని, పోలవరం తప్ప మిగతావన్నీ అనుమతులు రాని ప్రాజెక్టులేనని చెప్పారు. మనం మనం కొట్లాడుకుంటే వచ్చే లాభమేమీ లేదని, తెలంగాణపై తానెప్పుడూ కొట్లాడలేదని చంద్రబాబు చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టును తానెప్పుడు అడ్డుకోలేదని గుర్తు చేశారు. కృష్ణా జలాల విషయంలో కొత్త ట్రైబ్యునల్ వచ్చాకే కేటాయింపులపై ముందుకు వెళ్లాలని సూచించారు.
ఉమ్మడి ఏపీలో తానే ఎన్నో ప్రాజెక్టులు మొదలుబెట్టానని అన్నారు. దేవాదుల, కల్వకుర్తి, ఎస్ ఎల్ బీసీ…ఇవన్నీ తానే మొదలుబెట్టానని అన్నారు. ఏపీ, తెలంగాణ..ఎవరి శక్తి ప్రకారం వాళ్లు ప్రాజెక్టులు కట్టుకుందామని, ఎవరూ ఎవరిపై పోరాటాలు చేయాల్సిన అవసరం లేదని చెప్పారు. గోదావరిలో నీళ్లు పుష్కలంగా ఉన్నాయని, కృష్ణా నదిలో మాత్రమే తక్కువగా ఉన్నాయని, కూర్చొని మాట్లాడుకొని సమస్యలు పరిష్కరించుకుందామని పిలుపునిచ్చారు.
తన విజన్ వల్లే దేశంలో తెలంగాణ అత్యధిక పర్ క్యాపిటా ఇన్ కమ్ ఉన్న రాష్ట్రంగా మారిందని చంద్రబాబు చెప్పారు. తాను క్రియేట్ చేసిన హైదరాబాద్ ఎకో సిస్టమ్ బాగా పనిచేసి తెలుగు జాతికి ఉపయోగపడడం హర్షణీయమని అన్నారు.