‘‘2029లో వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే గంగమ్మ జాతరలో వేట తలలు నరికినట్టు రప్పా రప్పా నురుకుతాం ఒక్కొక్కడినీ’’
‘‘రాజారెడ్డి రాజ్యాంగం పల్నాడు నుంచే మొదలు’’
‘‘అన్న వస్తాడు.. అంతు చూస్తాడు’’
‘‘ఐయమ్ డిక్లేరింగ్ ద వార్.. జగన్ 2.0’’
రాజకీయం అన్న తర్వాత పరస్పర గౌరవాభిమానాలు.. ప్రేమ అప్యాయతలు లాంటివి ఉండవు. కుట్రలు.. కుతంత్రాలు కామన్. అయినప్పటికి ఒక లక్షణ రేఖ ఉండేది. సమకాలీన ప్రపంచంలో అలాంటి పరిస్థితి పోయి చాలా ఏళ్లు అయ్యింది. రాజకీయ ప్రత్యర్థిని శత్రువుగా చూడటం మొదలైంది. ఇప్పుడు ప్రత్యర్థి అంతు చూసే వరకు వెళ్లింది. నాలుగు గోడల మధ్యనో.. తమ వాళ్ల మధ్యనో నాలుగు రెచ్చగొట్టే మాటలు మాట్లాడే పరిస్థితి నుంచి బాహాటంగా బెదిరింపులకు దిగుతున్న వైనం చూస్తే.. ఏపీ ఎటు పోతోందన్నది ఇప్పుడు ప్రశ్న.
పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలోని రెంటపాళ్లకు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటించిన నేపథ్యంలో ఆ పార్టీ కార్యకర్తలు.. మద్దతుదారులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు ప్రదర్శించిన ఫ్లెక్సీలు.. ఫ్లకార్డుల్లో రెచ్చగొట్టే తరహాలో.. హింసకు పెద్దపీట వేసేలా ఉండటం షాకింగ్ గా మారింది. ఈ రక్తపు భాష ఏంది? అంటూ ముక్కున వేలేసుకునే పరిస్థితి.
ఎలాంటి మొహమాటం లేకుండా రప్పా రప్పా నరుకుతామని బహిరంగంగా ఫ్లకార్డులు పట్టుకొని తిరగటం దేనికి నిదర్శనం? అన్నదిప్పుడు ప్ఱశ్నగా మారింది. వైసీపీ మద్దతుదారుల వీరంగం.. వారి చేతుల్లో ఉన్న ఫ్లకార్డుల్ని చూస్తే.. అసలు ఏపీలో నిబంధనలు అమలవుతున్నాయా? పోలీసు వ్యవస్థ మీద గౌరవం ఉందా? వీధి రౌడీల మాదిరి ఈ అరాచకమేంది? సినిమాల్లో చూపించిన సీన్లు రియల్ లైఫ్ లో ఉండటమా? అన్నది ప్రశ్నగా మారింది.
ఏదైనా ప్రాంతానికి అధినేత వస్తున్నప్పుడు ఆయనకు ఘనస్వాగతం పలకటం తప్పేం కాదు. అందుకు భిన్నంగా ఈ హింసాత్మక ఫ్లకార్డులు ఏమిటి? అభ్యంతరకర భాషతో వీరంగం వేయటం చూస్తే.. రానున్న రోజుల్లో ఏపీ రాజకీయం మరెంత దారుణంగా మారుతుందన్న సంకేతాలు తాజా జగన్ పర్యటనలో స్పష్టమైందని చెప్పాలి. ఏమైనా ఈ తరహా వ్యవహారశైలికి సరైన చర్యలు తీసుకోకుంటే.. ఏపీ భయానక రాజ్యంగా మారుతుందని చెప్పక తప్పదు.
అయితే, ఈ విషయాన్ని ఖండించాల్సిన జగన్…సమర్థించడం కొసమెరుపు. పుష్ప సినిమాలో డైలాగ్ పెట్టినా తప్పేనా అని జగన్ ప్రశ్నించారు. గడ్డం కింద ఇలా అన్నా తప్పే అంటూ పుష్ప సినిమాలో అల్లు అర్జున్ మాదిరి తగ్గేదేలే అన్న రీతిలో జగన్ గడ్డం కింద చేయి పెట్టారు. దీంతో, జగన్ పై ట్రోలింగ్ జరుగుతోంది. యథా రాజా తధా ప్రజ అంటే ఇదేనని, జగన్ మాదిరే వైసీపీ నేతలు, కార్యకర్తలు వయిలెంట్ గా ఉన్నారని, అందుకే ప్రజలు 2024 ఎన్నికల్లో బుద్ధి చెప్పారని అంటున్నారు. ఇలా రప్పా రప్పా అని డైలాగులు చెబితే 2029 ఎన్నికల్లో కనీసం 11 సీట్లు కూడా రావని సెటైర్లు వేస్తున్నారు.