ఏపీ క్యాబినెట్ నుండి జనసేన మంత్రిని తప్పించబోతున్నారా..? మెగా బ్రదర్ నాగబాబు మంత్రివర్గంలోకి అడుగుపెట్టే సమయం ఆసన్నమైందా..? అంటే అవునన్న సమాధానమే వినిపిస్తోంది. వాస్తవానికి కేంద్ర రాజకీయాల్లో చక్రం తిప్పాలని నాగబాబు ఆశపడ్డారు. 2024 ఎన్నికల్లో అనకాపల్లి నుంచి లోక్ సభకు పోటీ చేయాలని భావించినప్పటికీ.. పొత్తులో భాగంగా ఆ సీటును బీజేపీకి కేటాయించాల్సి వచ్చింది. రాజ్యసభ సభ్యుల భర్తీ సమయంలోనూ నాగబాబుకు అవకాశం దక్కలేదు.
అదే సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఏపీ క్యాబినెట్ లోకి నాగబాబును తీసుకుంటున్నట్లు ప్రకటించారు. గత ఏడాది జూన్ 12న సీఎంగా చంద్రబాబు, మంత్రులుగా 24 మందితో రాష్ట్రంలో ప్రభుత్వం కొలువుతీరింది. అయితే క్యాబినెట్‌లో ఒక మంత్రి పదవి ఖాళీగా ఉంది .ఆ పదవిని నాగబాబుతో భర్తీ చేసేందుకు ప్లాన్ చేశారు. అందులో భాగంగానే నాగబాబును ఎమ్మెల్సీ చేశారు. ఇది జరిగి నెలలు గడుస్తున్నా ఇంతవరకు నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకోలేదు. ఇందుకు కారణం పవన్ కళ్యాణే అని అంటున్నారు.
ఇప్పటికే ఏపీ క్యాబినెట్ లో ముగ్గురు జనసేన మంత్రులు ఉన్నారు. అందులో పవన్ కళ్యాణ్, కందుల దుర్గేష్ కాపు సామాజిక వర్గానికి చెందినవారు కాగా.. నాదెండ్ల మనోహర్ కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. ముగ్గురూ ఓసీలే. ఇప్పుడు నాగబాబును క్యాబినెట్ లోకి తీసుకుంటే కుటుంబ సభ్యులతో పాటు కాపు సామాజిక వర్గానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారంటూ ప్రత్యర్థులు విమర్శలు గుప్పించే అవకాశాలు ఉన్నాయి.
ఈ నేపథ్యంలోనే జూలై చివరి వారంలో జరగబోయే స్వల్ప మంత్రివర్గ విస్తరణలో కందుల దుర్గేష్ ను తప్పించి.. ఆయనకు అదే స్థాయిలో ఉన్న రాష్ట్ర స్థాయి నామినేట్ పదవిని కట్టబెట్టబోతున్నారట. అలాగే కందుల దుర్గేష్ స్థానంలో బీసీ సామాజిక వర్గానికి చెందిన కొణతాల రామకృష్ణను క్యాబినెట్‌లోకి తీసుకోనున్నారట. అదే సమయంలో ఖాళీగా ఉన్న మంత్రి పదవిని నాగబాబుతో భర్తీ చేయనున్నారని.. పవన్ వ్యూహం అదేనని ప్రచారం జరుగుతుంది.