యూట్యూబ్‌లో రిలీజయ్యే డబ్బింగ్ సినిమాల ద్వారా ఉత్తరాదిన మంచి ఫాలోయింగ్ సంపాదించిన తెలుగు హీరోల్లో బెల్లంకొండ శ్రీనివాస్ ఒకడు. అతను చేసిన మాస్ సినిమాలు చాలానే హిందీలోకి అనువాదం అయ్యాయి. వాటిని యూట్యూబ్‌లో రిలీజ్ చేస్తే రికార్డు స్థాయిలో వ్యూస్ వచ్చాయి. దీంతో పాటుగా నార్త్ ఇండియాలో అతడికి మంచి ఫాలోయింగ్ వచ్చింది. ఇది చూసే బాలీవుడ్ ప్రముఖ నిర్మాతల్లో ఒకరైన జయంతి లాల్ గాడా.. శ్రీనివాస్‌తో నేరుగా హిందీ సినిమా చేయించాడు. అదే ఛత్రపతి.
రాజమౌళి బ్లాక్ బస్టర్లలో ఒకటైన ఛత్రపతిని వి.వి.వినాయక్ దర్శకత్వంలో శ్రీనివాస్ హీరోగా హిందీలో రీమేక్ చేస్తే.. అది అక్కడ దారుణంగా బోల్తా కొట్టేసింది. చాలా పాత సినిమా, పైగా హిందీ వాళ్లు కూడా యూట్యూబ్‌లో బాగా చూసేసిన సినిమా కావడమే దానికి ప్రతికూలంగా మారిందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. శ్రీనివాస్ సైతం ఈ సినిమా చేయడం తప్పే అని అంగీకరించాడు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. మేకింగ్ దశలోనే ఈ సినిమా విషయంలో తాము తప్పు చేస్తున్నట్లు అనిపించిందని అతను అభిప్రాయపడ్డాడు.
తన తరంలో దగ్గుబాటి రాణా, రామ్ చరణ్ మాత్రమే హిందీలో సినిమాలు చేశారని.. చరణ్ జంజీర్ రీమేక్ చేసి దెబ్బ తిన్నాడని.. ఐతే రాజమౌళి సినిమాలను అంతకుముందు హిందీలో రీమేక్ చేస్తే చాలా మంచి ఫలితాలు అందుకున్న నేపథ్యంలో ఛత్రపతిని రీమేక్ చేద్దామని తాము అనుకున్నట్లు శ్రీనివాస్ చెప్పాడు. పైగా నిర్మాత జయంతి లాల్ సైతం తమ ప్రేక్షకులకు మదర్ సెంటిమెంట్ బాగా ఎక్కేస్తుందని… అలాగే తనకున్న ఫాలోయింగ్ కూడా కలిసొస్తుందని చెప్పారని.. దీంతో ఛత్రపతి రీమేక్ చేయడానికి రెడీ అయ్యామని అన్నాడు.