టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యామిలీలో కరోనా మహమ్మారి కలకలం రేపింది. మహేష్ బాబు మరదలు, నమ్రత శిరోద్కర్ సోదరి, ప్రముఖ బాలీవుడ్ నటి శిల్పా శిరోద్కర్ కు టెస్టుల్లో కోవిడ్-19 పాజిటివ్ గా తేలింది. శిల్పా ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా స్వయంగా వెల్లడించింది. `హల్లో పీపుల్.. నాకు కోవిడ్ పరీక్షలో పాజిటివ్ అని తేలింది. మీరంతా జాగ్రత్తగా ఉండండి.. తప్పకుండా మాస్క్ ను ధరించండి` అని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టింది.
ఈ పోస్ట్ వైరల్ గా మారడంతో అభిమానులు, సినీ ప్రముఖులు శిల్కా త్వరగా కోవిడ్ నుంచి కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు. యావత్ ప్రపంచాన్ని గజగజ వణికించిన కరోనా మళ్లీ కొత్త రూపంలో విజృంభిస్తోంది. సింగపూర్, హాంకాంగ్, చైనా, థాయిలాండ్ వంటి దేశాల్లో కరోనా వేగంగా వ్యాప్తి చెందుతోంది. సింగపూర్ లో ఇప్పటికే 14 వేలకు పైగా కరోనా కేసులు రిజిస్టర్ అయినట్లు తెలుస్తోంది. దీంతో ఆయా దేశంలో మళ్లీ లాక్ డౌన్ తప్పదనే భయం ప్రజల్లో మొదలైంది.
అయితే ఈ కొత్త వేరియంట్ అంత ప్రమాదకరం కాదని.. ఇప్పటివరకు వైరస్ బారిన పడ్డ బాధితుల్లో స్వల్ప అనారోగ్యం మినహా ఎటువంటి తీవ్రమైన లక్షణాలు కనిపించలేదని వైద్యులు చెబుతున్నారు. అయినప్పటికీ ప్రతి ఒక్కరూ స్వీయ జాగ్రత్త వహించాలని హెచ్చరిస్తున్నారు. ఇక ఇటువంటి పరిస్థితుల్లో దుబాయ్‌లో ఉంటున్న శిల్పా శిరోద్కర్‌కు కోవిడ్ సోకడం కుటుంబ సభ్యులను కొంత ఆందోళన కలిగిస్తోంది. కాగా, 90వ దశకంలో శిల్పా బాలీవుడ్ లో బిజీ యాక్ట్రస్‌గా రాణించారు. అగ్ర హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. 2000 సంవత్సరంలో ఆమె సినిమాలకు దూరం అయ్యారు. అయితే 2013 నుంచి సీరియల్స్ లో నటిస్తూ వచ్చిన శిల్పా.. ఇటీవలే హిందీలో ప్రసారమైన బిగ్ బాస్ సీజన్ 18లో పాల్గొని మరోసారి మునుపటి క్రేజ్‌ను సంపాదించుకున్నారు. దాంతో బాలీవుడ్ లో శిల్పా శిరోద్కర్ కు మళ్లీ సినిమా అవకాశాలు రావడం ప్రారంభం అయ్యాయి.