తమిళ స్టార్ హీరో విశాల్ 47 ఏళ్ల వయసులో పెళ్లి పీటలెక్కబోతున్నాడా..? ఇండస్ట్రీకి చెందిన అమ్మాయితో త్వరలోనే ఏడడుగులు వేయబోతున్నాడా..? అంటే అవునన్న సమాధానమే వినిపిస్తోంది. నడిగర్ సంఘం(తమిళ సినిమా నటీనటుల సంఘం) బిల్డింగ్ నిర్మాణం పూర్తయిన వెంటనే తను పెళ్లి చేసుకుంటానని గతంలో విశాల్ ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం ఆ బిల్డింగ్ నిర్మాణ పనులు ముగింపు దశకు చేరుకున్నాయి.
ఈ నేపథ్యంలోనే తాజాగా మధురై మీనాక్షి అమ్మవారి దర్శనానికి వచ్చిన విశాల్ ను మీడియా పెళ్లి పై ప్రశ్నించింది. అందుకు విశాల్.. `త్వరలోనే పెళ్లి చేసుకుంటాను. నా లైఫ్ పార్ట్నర్‌ను కనుగొన్నాను. పెళ్ళి గురించి ఇప్పటికే మా మధ్య చర్చలు జరుగుతున్నాయి. తప్పకుండా ప్రేమ వివాహమే చేసుకుంటా. త్వరలో వెడ్డింగ్ డేట్ మరియు మరిన్ని వివరాలు వెల్లడిస్తా` అంటూ అఫీషియల్‌గా పెళ్లి ప్రకటన చేసేశాడు.
ఇక ఇదే తరుణంలో విశాల్ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ప్రముఖ నటి సాయి ధన్షిక అంటూ జోరుగా ప్రచారం జరుగుతుంది. గత కొద్ది నెలల నుంచి విశాల్, సాయి ధన్షిక ప్రేమలో ఉన్నారని.. పెద్దలు అంగీకరించడంతో పెళ్లికి కూడా సిద్ధం అవుతున్నారంటూ పలు స్థానిక, ఆంగ్ల పత్రికల్లో వార్తలు వస్తున్నాయి. ఈ విషయాన్ని విశాల్ సన్నిహిత వర్గాలు కూడా కన్ఫామ్ చేస్తున్నాయి. అయితే సాయి ధన్షిక మాత్రం ఇంతవరకు పెళ్లిపై నోరు విప్పలేదు. కాగా, సాయి ధన్షిక తమిళంలో ఎక్కువగా సినిమాలు చేసింది. తెలుగులో షికారు, అంతిమ తీర్పు, దక్షిణ వంటి చిత్రాల్లో మెరిసింది.