తెలంగాణ మంత్రి కొండా సురేఖ తన వివాదాస్పద వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. గతంలో సినీ నటి సమంత, మాజీ మంత్రి కేటీఆర్ లపై కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపాయి. అయినా సరే తీరు మారని కొండా సురేఖ తాజాగా మరోసారి తన వ్యాఖ్యలతో వివాదంలో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో మంత్రులు కమీషన్లు తీసుకోకుండా ఏ పనీ చేయడం లేదని కొండా సురేఖ వ్యాఖ్యానించినట్లుగా జోరుగా ప్రచారం జరుగుతోంది.
ఈ క్రమంలోనే ఈ వ్యవహారంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. కనీసం ఇప్పటికైనా కొన్ని నిజాలు బయటపెట్టిన కొండా సురేఖకు హృదయపూర్వక అభినందనలు తెలుపుతున్నానంటూ కేటీఆర్ సెటైర్లు వేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ‘కమీషన్ సర్కార్’గా మారిపోయిందని, అది బహిరంగ రహస్యమేనని విమర్శలు గుప్పించారు. ఫైళ్లపై సంతకాలు పెట్టాలంటే మంత్రులు 30 శాతం కమీషన్ తీసుకుంటున్నారని కేటీఆర్ ఆరోపించారు. ఇది అత్యంత దురదృష్టకరమని అన్నారు.
సచివాలయంలో కొందరు కాంట్రాక్టర్లు ఆ కమీషన్ల వ్యవహారంపై ధర్నా చేసిన విషయాన్ని కేటీఆర్ గుర్తుచేశారు. ఆ ఘటన వల్లే మంత్రుల కమీషన్ల భాగోతం బట్టబయలైందని అన్నారు. అయితే, ఆ మంత్రుల పేర్లు బయటపెట్టాలని సురేఖకు కేటీఆర్ సవాల్ విసిరారు. ఈ వ్యవహారంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.