అజిత్ కు ఇళయరాజా షాక్

admin
Published by Admin — March 18, 2025 in Movies
News Image
అనుమతి లేకుండా.. రాయల్టీ చెల్లించకుండా తన పాటలు, బ్యాగ్రౌండ్ స్కోర్ ఏ చిత్రంలో వాడినా ఊరుకోవట్లేదు లెజెండరీ డైరెక్టర్ ఇళయరాజా. తన మీద అభిమానంతో ఏదైనా సినిమాలో బ్యాగ్రౌండ్లో తన పాటను వినిపించినా.. ఆయన ఊరుకోవట్లేదు. తనకెంతో సన్నిహితులైన వాళ్లు తన పాటలను ఉపయోగించినా ఆయన తేలిగ్గా తీసుకోవట్లేదు.
 
గతంలో తనకెంతో ఆప్తుడైన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం.. మ్యూజిక్ కన్సర్ట్స్‌లో తన పాటలు వాడుతున్నందుకు నోటీసులు ఇవ్వడం ఎంత చర్చనీయాంశం అయిందో తెలిసిందే. గత ఏడాది బ్లాక్‌బస్టర్ అయిన ‘మంజుమ్మల్ బాయ్స్’ సినిమాలో తన పాట వాడినందుకు నోటీసులిచ్చి రాయల్టీ కూడా వసూలు చేశారాయన. తాజాగా ఓ బ్లాక్ బస్టర్ మూవీ టీంకు నోటీసులు పంపించడం హాట్ టాపిక్‌గా మారింది. ఆ చిత్రమే.. గుడ్ బ్యాడ్ అగ్లీ.
 
అజిత్ కథానాయకుడిగా నటించిన ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ గత గురువారమే భారీ అంచనాల మధ్య విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. వీకెండ్లో భారీ వసూళ్లు సాధించిన ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ ఆ తర్వాత కూడా నిలకడగా సాగుతోంది. ఐతే ఈ సినిమాలో కొన్ని వింటేజ్ సీన్లు చూపించే క్రమంలో ఇళయరాజా పాటలను వాడుకున్నారు. టీం ఉద్దేశం ఏమైనా కానీ.. ఇళయరాజా మాత్రం ఈ వాడకం మీద తనదైన శైలిలోనే స్పందించారు.
 
ఒత్త రూప తారేన్, ఇలమై ఇదో ఇదో, ఎన్ జోడి మంజా కరువై పాటలను బ్యాగ్రౌండ్లో వాడినందుకు రూ.5 కోట్ల పరిహారం చెల్లించాలని ఆయన చిత్ర బృందానికి నోటీసులు పంపారు. అంతే కాక తన అనుమతి లేకుండా వాడిన ఈ పాటలను తొలగించడంతో పాటు తనకు క్షమాపణ చెప్పాలని కూడా ఆయన నోటీసుల్లో పేర్కొనడం గమనార్హం. మరి ఈ నోటీసులపై టీం ఎలా స్పందిస్తుందో చూడాలి.
Recent Comments
Leave a Comment

Related News

Latest News