టాలీవుడ్ ను వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. రెండు రోజుల క్రితం డైరెక్టర్ ఏఎస్ రవికుమార్ చౌదరి, ఆ వెంటనే సీనియర్ నిర్మాత కావూరి మహేంద్ర మృతి చెందిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా టాలీవుడ్ లో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ సినీ, టీవీ నటుడు అల్లం గోపాలరావు(75) కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఈరోజు ఉదయం 8 గంటలకు తన నివాసంలోనే తుదిశ్వాస విడిచారు.
అల్లం గోపాలరావు మరణంతో అటు ఆయన కుటుంబంతో పాటు ఇటు ఇండస్ట్రీలోనూ విషాదఛాయలు అలముకున్నాయి. పలువురు ప్రముఖులు గోపాలరావు భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులు అర్పిస్తున్నారు. ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకు మహాప్రస్థానంలో ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి.
గోపాలరావు భార్య పేరు విమల. ఈ దంపతులకు అనిల్, సునీల్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడు అనిల్ కూడా నటుడే. బుల్లితెరపై పలు సీరియల్స్ తో పాటు సినిమాల్లో అనిల్ నటిస్తున్నాడు. గోపాలరావు విషయానికి వస్తే.. ఈయన చాలా ఏళ్ల నుంచి బుల్లితెర నటుడిగా సత్తా చాటుతున్నారు.
స్టార్ మా, జీ తెలుగు, ఈటీవీ సీరియల్స్‌లో ఎక్కువగా కనిపించేవారు. టాప్ రేటింగ్ సీరియల్ `గుప్పెడంత మనసులో` మినిస్టర్ పాత్రలో నటించి మరింతగా పాపులర్ అయ్యారు. అప్పుడుప్పుడు బ్రహ్మముడి సీరియల్‌లో జడ్జ్ పాత్రలో అలరిస్తుండేవారు. అలాగే వెండితెరపై కూడా అల్లం గోపాలరావు చాలా చిత్రాల్లో నటించారు.