రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయింది. ఈ నేపథ్యంలో సమాజంలోని వివిధ వర్గాల సంతృప్తి ఏ రకంగా ఉంది? ఎవరు ఏమనుకుంటున్నారు? అనేది ఆసక్తికర విషయం. దీనిపై సీఎం చంద్రబాబు ఇప్పటికే సర్వేలు చేయించుకున్నారు. రిపోర్టులు తెప్పించుకున్నారు. ప్రజల సంతృప్తి స్థాయిని కూడా ఆయన అంచనా వేసుకున్నారు.
దీనికి స్వచ్చంద సంస్థలు అలాగే సర్వే సంస్థలు కూడా ప్రజలు నాడిని పట్టుకునే ప్రయత్నం చేశాయి. చేస్తున్నాయి కూడా. ఈ క్రమంలో సమాజంలోని రెండు కీలక వర్గాలకు సంబంధించి చంద్రబాబు పట్ల అలాగే కూటమి పాలన పట్టా సంతోషం వ్యక్తం కావడం గమనార్హం. వీరిలో ఒకరు సామాన్యులు. మరొకరు మధ్యతరగతి ప్రజలు. సాధారణంగా సామాన్యులు మధ్యతరగతి ప్రజలే ఎన్నికల్లో నాయకులను నిర్ణయిస్తారు.
ముఖ్యంగా సామాన్యులు ఈ విషయంలో ముందుంటారు. తాజాగా వీరిని పలకరించినప్పుడు అన్నా క్యాంటీన్లు అదేవిధంగా పింఛన్ల పెంపు ఎంతో బాగున్నాయని వారు చెబుతుండడం గమనార్హం. ముఖ్యంగా సామాన్యులను పలకరించినప్పుడు ప్రస్తుతం పెరిగిపోయిన ధరలతో తాము ఇబ్బందులు పడుతున్నామని ఈ సమయంలో ఐదు రూపాయలకే భోజనం అయిదు రూపాయలకే టిఫిన్ వంటివి అందించడం ద్వారా తమ ఆకలి తీరుస్తున్నారని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
అదేవిధంగా వృద్ధులు సామాన్యులు పింఛన్ల పెంపు కారణంగా ఆనందం వ్యక్తం చేస్తూ ఉండడం మరో విశేషం. అలాగే మధ్య తరగతి విషయానికి వస్తే రహదారుల నిర్మాణం కొత్త రోడ్లు వేయడంపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా రాష్ట్రానికి భారీ ఎత్తున పెట్టుబడులు తీసుకువచ్చి ఉపాధి కల్పన, ఉద్యోగాల కల్పనకు ప్రాధాన్యమిస్తుండటం వంటి విషయాలపై వారు సంతోషంగా ఉన్నారన్నది వాస్తవం.
మొత్తంగా ఈ ఏడాది పాలనపై సామాన్యులు మధ్యతరగతి ప్రజలు సంతోషంగానే ఉన్నారని చెప్పాలి. పెద్దగా పన్నుల భారం లేకపోవడం అదేవిధంగా సామాన్యులను దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకోవడం వంటివి కలిసి వస్తున్నాయి.