ఆసక్తికర వ్యాఖ్య చేసింది అలహాబాద్ హైకోర్టు. గృహహింస చట్టం కింద రక్షణ కోరే అవకాశం కేవలం కోడళ్లకు మాత్రమే కాదు.. అత్తలకూ ఉంటుందని పేర్కొంది. చట్టం కోడళ్లకే పరిమితం కాదని.. అత్తలూ రక్షణ పొందే వీలుందన్న వ్యాఖ్యను తన తాజా ఆదేశంతో స్పష్టం చేసింది. తనకు కోడలు పెట్టే గృహహింస నుంచి రక్షణ కల్పించాలని కోరుతూ ఒక మహిళ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ చేపట్టిన హైకోర్టు ఈ వ్యాఖ్య చేసింది.కుటుంబంలోని ఏ మహిళ అయినా గృహహింస చట్టం కింద రక్షణ పొందే వీలుందని జస్టిస్ అలోక్ మాథుర్ నేత్రత్వంలోని హైకోర్టు తీర్పును ఇచ్చింది. గృహహింసకు సంబంధించి తనపై తన అత్త దాఖలు చేసిన పిటిషన్ కు సంబంధించి కోడలు.. ఆమె తరఫు బంధువులు సవాల్ చేస్తూ అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ సందర్భంగా కోడలు వేసిన పిటిషన్ ను హైకోర్టు కొట్టేసింది.అదే సమయంలో మేజిస్ట్రేట్ ఇచ్చిన తీర్పును సమర్థించింది. హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన కోడలు.. తన వాదనల్లో భాగంగా గృహహింస చట్టం కేవలం కోడళ్లకు మాత్రమే ఉద్దేశించిందని పేర్కొనటంపై హైకోర్టు స్పందించింది.అంతేకాదు.. మెజిస్ట్రేట్ తీర్పును సవాల్ చేసింది. దీన్ని కొట్టేసిన హైకోర్టు.. గృహహింసకు గురయ్యే ప్రతి మహిళకు ఈ చట్టం వర్తిస్తుందని చెప్పింది.అంతేకాదు.. ఈ చట్టం కేవలం కోడళ్లకు మాత్రమే చేయలేదంటూ చురకలు అంటిస్తూ.. చట్టంలోని సెక్షన్ 12 కింద కుటుంబంలోని ఈ స్త్రీ అయినా రక్షణ కోరవచ్చని స్పష్టం చేసింది. ఇంతకూ ఈ కేసు ఏమంటే.. యూపీ రాష్ట్రానికి చెందిన గరిమా అనే మహిళకు ఒక వ్యక్తితో పెళ్లైంది. అయితే.. అత్తింట్లో కాకుండా రాయబేరీలోని సొంతింటికి వెళ్లిపోదామని భర్తపై పదే పదే ఒత్తిడి తెచ్చేది. అయితే.. అతను నో చెప్పటం.. తల్లితో కలిసి ఉందని చెప్పేవాడు.దీంతో.. అత్త అయిన సుధామిశ్రాకు కోడలు చేతిలో వేధింపులకు గురయ్యేవారు. అంతేకాదు.. తన కోడలు తరఫు బంధువులు ఇంటికి వచ్చి డబ్బును.. బంగారాన్ని ఎత్తుకెళ్లినట్లుగా ఆరోపించింది. తన కోడలు తనను హింస పెడుతుందని పేర్కొంటూ కోర్టును ఆశ్రయించింది. దీంతో.. మేజిస్ట్రేట్ కోర్టు అత్త వాదనను సమర్థించగా.. దీనికి బదులుగా కోడలు హైకోర్టును ఆశ్రయించి.. గృహహింస చట్టం కోడళ్లకు మాత్రమే వర్తిస్తుందని పేర్కొనటంతో..అలహాబాద్ హైకోర్టు ఆమె వాదన తప్పు అని స్పష్టం చేయటమే కాదు.. మెజిస్ట్రేట్ ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ ఆదేశాలు జారీ చేసింది.