తిరుమల శ్రీవారితో పెట్టుకున్న తమిళ కమెడియన్

admin
Published by Admin — May 15, 2025 in Movies
News Image

తెలుగులో సునీల్ లాగే తమిళంలో కమెడియన్‌గా తిరుగులేని స్థాయిని అందుకుని, ఆ తర్వాత హీరోగా మారిన నటుడు, కమెడియన్ .. సంతానం. సునీల్ హీరోగా కొన్ని ఎదురు దెబ్బల తర్వాత తిరిగి కమెడియన్‌గా మారిపోయాడు. విలన్, క్యారెక్టర్ వేషాలూ వేస్తున్నాడు. కానీ సంతానం మాత్రం హీరోగానే కంటిన్యూ అవుతున్నాడు. అతను లీడ్ రోల్‌లో రెండంకెల సంఖ్యలో సినిమాలు వచ్చాయి. తాజాగా అతను హీరోగా ‘డెవిల్స్ డబుల్ నెక్స్ట్ లెవెల్’ అనే సినిమా తెరకెక్కింది.

సంతానం కెరీర్లో పెద్ద హిట్ అయిన ‘దిల్లుకు దుడ్డు’కు కొనసాగింపుగా తెరకెక్కిన హార్రర్ కామెడీ ఇది. మంచి బజ్ తెచ్చుకున్న ఈ చిత్రం.. ఈ నెల 16న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఐతే రిలీజ్ ముంగిట ఈ సినిమా అనూహ్యంగా వివాదంలో చిక్కుకుంది. అందుక్కారణం.. ఇందులోని ఒక పాట. హీరోను కీర్తిస్తూ సాగే ఈ పాటలో స్టార్టింగ్ లిరిక్స్ వివాదానికి దారి తీశాయి. తిరుమల శ్రీ వేంకటేశ్వరుడి సన్నిధిలో మార్మోగే ‘‘శ్రీనివాసా గోవిందా.. శ్రీ వేంకటేశా గోవిందా’’ పాట లిరిక్స్‌ను ఇందులో వాడారు. ఈ లైన్స్‌తోనే పాట మొదలై.. తర్వాత మామూలుగా సాగుతుంది.

ఐతే శ్రీవారి ఫేమస్ కీర్తనను ఇలా కమర్షియల్ పాటలో ఇరికించి దాన్ని చెడగొట్టారంటూ పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఏపీతో పాటు తమిళనాడులో కూడా ఈ పాట మీద అభ్యంతరాలతో కేసులు నమోదవడం గమనార్హం. తిరుపతి జనసేన నేత కిరణ్ రాయల్.. ఈ పాట విషయమై తమిళనాడు మాజీ సీఎం పళనిస్వామిని కలిశాడు. ఈ సినిమా రిలీజ్‌ను అడ్డుకోవాలని, పాటను మూవీ నుంచి తొలగించాలని అతను డిమాండ్ చేశాడు. కొన్ని రోజుల వ్యవధిలో ఈ పాట చుట్టూ వివాదం పెద్దదైపోవడంతో సంతానం సైతం స్పందించాడు.

తాను సెన్సార్ బోర్డు, కోర్టులను అనుసరించి ముందుకు సాగుతానని.. నిబంధనలను ఎక్కడా అతిక్రమించలేదని.. స్వయంగా తిరుమల శ్రీవారి భక్తుడినైన తాను ఆయన్ని కించపరిచేలా వ్యవహరించనని అన్నాడు. ఎవరో దారిన పోయేవాళ్లు ఏదో చెబితే తాను సినిమా నుంచి ఒక పాటను తీసేయడం జరగదంటూ అతను రిటార్ట్ ఇచ్చాడు. మరి ఈ వివాదం ఎక్కడిదాకా వెళ్తుందో చూడాలి.

Tags
landed in controversy tamil actor santhanam tirumala lord balaji
Recent Comments
Leave a Comment

Related News

Latest News