రాష్ట్రంలో పెట్టుబడులను ఆశిస్తున్న కూటమి ప్రభుత్వం ఆ దిశగా కీలక చర్యలు చేపట్టింది. దీనిలో భాగంగా `స్వర్ణాంధ్ర-2047` విజనను సాకారం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేసింది. ఈ టాస్క్ ఫోర్స్ ద్వారా మరింత పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించడంతోపాటు పెట్టుబడిదారులను సంతృప్తిపరిచేలా వ్యవహరించేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేయనుంది. ఈ టాస్క్ ఫోర్స్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు చైర్మన్గా వ్యవహరించనున్నారు.
అదేవిధంగా టాటా సన్స్ చైర్మన్ చంద్రశేఖరన్ కో చైర్మన్గా వ్యవహరిస్తారు. ఇక ఈ టాస్క్ ఫోర్స్ లో సిఐఐ డిజి చంద్రజిత్ బెనర్జీ, అపోలో ఆసుపత్రి వైస్ చైర్మన్ ప్రీతా రెడ్డి అలాగే భారత్ బయోటిక్ ఎండి సుచిత్ర ఎల్లా, ప్రొఫెసర్ రాజు రెడ్డి సలహాదారు సతీష్ రెడ్డి వంటి వారిని నియమించారు. వీరంతా రాష్ట్రంలో పెట్టుబడులకు సంబంధించిన అన్ని మార్గాలను అన్వేషించడంతోపాటు పెట్టుబడిదారులకు మరింత మెరుగైన సౌకర్యాలను కల్పించేలా ప్రభుత్వానికి సూచనలు సలహాలు ఇవ్వనున్నారు.
అలాగే జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పెట్టుబడిదారులను రాష్ట్రానికి రప్పించే బాధ్యతలను కూడా ఈ టాస్క్ ఫోర్స్ తీసుకోనుంది. తద్వారా వచ్చే నాలుగు సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ ను దేశంలోనే అత్యధిక పెట్టుబడిదారులు ఉన్నటువంటి రాష్ట్రంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు భావిస్తున్నారు. ఫలితంగా ఉపాధి ఉద్యోగ అవకాశాలను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఏటా నాలుగు లక్షల మంది యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాలను కల్పించాల్సి ఉంది.