కాపు ఉద్యమ మాజీ నాయకుడు, మాజీ ఎంపీ ముద్రగడ పద్మనాభం(రెడ్డి) తాజాగా సంచలన లేఖ రాశారు. తన కుటుంబానికి.. తన కుమార్తె-అల్లుడితో ఎలాంటి అనుబంధం, బంధం లేదని పేర్కొన్నారు. ముఖ్యంగా తనకు కేన్సర్ వచ్చిందని ప్రచారం చేస్తున్నారని.. కానీ.. తనకు వయో సంబంధమైన కొన్ని అనారోగ్య సమస్యలే ఉన్నాయని తెలిపారు. అయినప్పటికీ.. తానేమీ ఎవరి ఇంటికీ వెళ్లలేదన్నారు. తన చిన్న కొడుకును.. తనను వేరు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు.
“నన్ను పట్టించుకోవడం లేదని.. నా చిన్నకొడుకుపై ప్రేలాపనలు చేస్తున్నారు. ఇది పూర్తిగా తప్పు“ అని వ్యాఖ్యానించారు. తన కొడుకు ఎదుగుదలను చూసి `కొందరు` ఓర్వలేకపోతున్నారని చెప్పారు. ఎవరో ఏడుస్తారని.. తాను, తన బిడ్డలు రాజకీయాలను వదులుకునేది లేదని స్పష్టం చేశారు. ‘మా కుటుంబంపై మరో కుటుంబం కొంతకాలంగా దాడి చేస్తోంది. మా కుటుంబాల మధ్య సంబంధాలు పూర్తిగా పోయాయి“ అని తేల్చి చెప్పారు.
ఇదేసమయంలో తన కొడుకునే కాదు.. తన మనవడిని కూడా రాజకీయాల్లోకి తీసుకువస్తున్నట్టు ముద్రగడ తెలిపారు. వారిని ముఖ్యమంత్రి స్థాయికి చేరుస్తానన్నారు. “ఎన్ని జన్మలు ఎత్తినా ఆ కుటుంబం గడప తొక్కను“ అంటూ.. తన కుమార్తె క్రాంతి చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. అదేవిధంగా తాను గతంలో తన వియ్యంకుడికి, వియ్యపురాలికి కూడా వైద్య సేవలు చేశానని.. వారు ఆసుపత్రిలో ఉంటే.. అక్కడే 15 రోజుల వరకు ఉన్నానని గుర్తు చేశారు.