మమతా బెనర్జీ పాలనలో నడుస్తున్న పశ్చిమ బెంగాల్ పై బోలెడన్ని విమర్శలు.. షాకింగ్ వీడియోలు ఇప్పటికే సోషల్ మీడియాలో హల్ చల్ చేయటం తెలిసిందే. దీదీ రాజ్యంలో షాకింగ్ ఉదంతాలకు కొదవలేదన్న ఆరోపణలు ఉన్నాయి. ఇలాంటి వేళ.. ఎవరూ ఊహించని ఉదంత ఒకటి వెలుగు చూసింది. ఒక ప్రభుత్వ పాఠశాలలో హిందువులు.. ముస్లిం విద్యార్థులకు వేర్వేరుగా మధ్యాహ్న భోజనాల్ని వండుతున్న వైనం వెలుగు చూసింది.
పశ్చిమ బెంగాల్ లోని తూర్పు బర్ధమాన్ జిల్లా కాల్నా సబ్ డివిజన్ పాఠశాలలో ఈ ఉదంతం ఏళ్లకు ఏళ్లుగా నడుస్తున్నట్లుగా చెబుతున్నారు. ఈ స్కూల్లో మొత్తం 72 మంది విద్యార్థులు ఉండగా.. వీరిలో 43 మంది హిందువులు.. 29 మంది ముస్లిం విద్యార్థులు. వీరి కోసం ప్రభుత్వం చేపట్టే మధ్యాహ్న భోజనం వేర్వేరుగా వండుతున్న వైనం వెలుగు చూసింది. అయితే.. కొన్నేళ్లుగా ఇదే విధానాన్ని తాము అమలు చేస్తున్నట్లుగా స్కూల్ సిబ్బంది చెబుతున్నారు.
షాకింగ్ అంశం ఏమంటే.. భోజనం వేర్వేరుగా వండటమే కాదు.. వంట సామాగ్రి సైతం వేర్వేరుగా ఉందన్న విషయం వెలుగు చూసింది. గ్యాస్ సిలిండర్ తప్పించి.. మిగిలినవన్నీ వేర్వేరుగానే ఉన్నాయని చెబుతున్నారు. వేర్వేరుగా వండుతామని.. వేర్వేరుగానే వడ్డిస్తామని.. ఇది చాలా కాలంగా సాగుతుందని వారు వెల్లడిస్తూ.. ‘‘స్కూల్ యాజమాన్యం ఆదేశాల్ని పాటించాల్సిందే. మేం చేసేదేమీ లేదు’’ అని పేర్కొన్నారు.
అలా అని తమ స్కూల్లో ఎలాంటి సమస్యలు లేవని.. మత విభేదాలు అంతకన్నా లేవన్న విషయాన్ని వంట చేసే మహిళ చెబుతూ.. ‘విద్యార్థులంతా కలిసి క్లాసులకు వస్తారు. భోజనం మాత్రం వేర్వేరుగా వండుతారు. మొదట్నించి ఇదే పద్దతి సాగుతోంది. ఈ పద్దతిని మారిస్తే మంచిదే. ఖర్చు కూడా తగ్గుతుంది. కానీ.. స్కూల్ యాజమాన్యం ఇదే తీరును అమలు చేస్తోంది’ అని వెల్లడించారు. ఈ ఉదంతం బయటకు రావటం.. సోషల్ మీడియాలో వైరల్ కావటంతో జిల్లా యంత్రాంగం ఈ వ్యవహారంపై విచారణకు ఆదేశించారు. రిపోర్టు ఇవ్వాలని పేర్కొన్నారు.