తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ ఎస్ ఫైర్ బ్రాండ్ నాయకుడు హరీష్‌రావు.. తాజాగా ఆటోడ్రైవర్ అవతారం ఎత్తారు. ఆటో కార్మికులు చొక్కాపై చొక్కా వేసుకునే విధంగా హరీష్‌రావు కూడా.. తన తెల్లటి చొక్కాపై ఖాకీ చొక్కాను ధరించారు. కొద్ది సేపు.. ఆటోలో చక్కర్లు కొట్టారు. ఈ సందర్భంగా ఆయన ఆటో కార్మికుల కష్టాల ను కళ్లారా తెలుసుకున్నానని కామెంట్ చేశారు. వారిని ప్రభుత్వం పట్టించుకోవట్లేదన్నారు.
ఏం జరిగింది?
రాష్ట్రంలో మహాలక్ష్మి పథకం అమలు చేస్తున్న విషయం తెలిసిందే. మహిళలకు రాష్ట్రంలో ఉచితంగా బస్సు ప్రయాణాన్ని కల్పించారు. దీనివల్ల ఆటో, ట్యాక్సీ గిరాకీలు పడిపోయాయి. అయితే.. గతంలో ఈ పథకాన్ని ప్రారంభించినప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఆటో, ట్యాక్సీ డ్రైవర్లకు అండగా ఉంటామని హామీ ఇచ్చింది. వారిని కూడా ఆర్థికంగా ఆదుకుంటామని చెప్పింది. అయితే.. ఏడాదిన్నర గడిచినా.. ఇప్పటి వరకు ఎలాంటి ప్రయత్నం చేయలేదు.
దీంతో తమ కష్టాలు చెప్పుకొనేందుకు ఆటో డ్రైవర్లు తాజాగా హరీష్‌రావును కలిశారు. ఆయన కోసం ప్రత్యే కంగా ఓ ఖాకీ చొక్కాను తీసుకువచ్చి బహూకరించారు. డ్రైవర్ల ఆత్మీయతకు పొంగిపోయిన హరీష్‌రావు.. వారిచ్చిన చొక్కా ధరించి.. ఆటోలో కాసేపు చక్కర్లు కొట్టారు. ఈ సందర్భంగా వారి సమస్యలు విన్నారు. కిరాయిలు లేక.. గిరాకీ లేక.. తకు ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయని డ్రైవర్లు పేర్కొన్నారు. ప్రభుత్వం తమను పట్టించుకోలేదన్నారు. దీనిపై స్పందించిన హరీష్‌రావు.. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తానని హామీ ఇచ్చారు.