పల్నాడు జిల్లా రెంటపాళ్లలో వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటనలో అపశృతి చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. జగన్ కారు కింద నలిగి సింగయ్య అనే వృద్ధుడు మృతి చెందాడు. ఈ ఘటనపై ఇప్పటికే నల్లపాడు పీసీలో కేసు నమోదు చేసిన పోలీసులు.. ఏ1గా మాజీ సీఎం కారు డ్రైవర్ రమణారెడ్డి, ఏ2గా జగన్ మోహన్ రెడ్డి, వైసీపీకి చెందిన సుబ్బారెడ్డి, వ్యక్తిగత సహాయకుడు నాగేశ్వరరెడ్డి, విడుదల రజినీ, పేర్నినానితో సహా మరికొందరి పేర్లు చేర్చారు.
ఈ క్రమంలోనే జగన్ తో సహా మిగతా నిందితులు హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు. సింగయ్య ఒంటిపై ఉన్న గాయాలు చూస్తే వాహనం కిందపడి చనిపోయినట్లు లేదని.. కావాలనే కూటమి ప్రభుత్వం తనపై కుట్ర చేస్తుందని జగన్ ఆరోపించారు. తనపై నమోదైన కేసును కొట్టివేయాలని కోరుతూ జగన్ బుధవారం లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు.
శుక్రవారం విచారణ చేపట్టిన ధర్మాసనం కీలక ఆదేశాలు జారీ చేసింది. సింగయ్య మృతి కేసులో నిందితులపై ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని పోలీసులకు హైకోర్టు స్పష్టంగా ఆదేశించింది. అనంతరం తదుపరి విచారణను జులై 1వ తేదీకి వాయిదా వేసింది. దీంతో జగన్ కు ఉన్నద న్యాయస్థానంలో తాత్కాలికంగా రిలీఫ్ లభించినట్లైంది.