రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపుతున్న దళితుడు సింగయ్య మృతి వెనుక మిస్టరీ వీడింది. తాజాగా ఫోరెన్సిక్ రిపోర్టులో నిజానిజాలు వెల్లడయ్యాయి. మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ ప్రయాణించిన వాహనమే సింగయ్యను తొక్కి చంపినట్లు ఫోరెన్సిక్ నివేదిక ఇచ్చింది. గత నెల 18న వైఎస్ జగన్ పల్నాడు జిల్లాలో పర్యటించిన సంగతి తెలిసిందే. అయితే ఆ సమయంలో సింగయ్య అనే వ్యక్తి జగన్ వాహనం కింద పడి తీవ్రంగా గాయపడ్డారు. అక్కడే ఉన్నా కొందరు వైసీపీ కార్యకర్తలు సింగయ్యను కారు కింద నుంచి బయటకు లాగి ఆ పక్కనే పడేసి వెళ్ళిపోయారు. దాంతో సింగయ్య కొద్దిసేపటికే మృతి చెందాడు.
మొదట వైసీపీ నేత దేవినేని అవినాష్ అనుచరుడు వాహనం ఢీ కొట్టడం వల్ల సింగయ్య చనిపోయాడని పోలీసులు భావించారు. కానీ కొద్దిరోజులకు సింగయ్య నేరుగా జగన్ కారు కింద పడి నలిగిపోతున్న దృశ్యాలు నెట్టింట వైరల్ కావడంతో ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా పెను సంచలనం రేపింది. జగన్‌ను కావాలనే ఇరికిస్తున్నారని.. అవి మార్ఫింగ్ వీడియోలను వైసీపీ వారు ఆరోపించారు. కానీ, అసలు వాస్తవానికి వెలుగులోకి వచ్చాయి.
సింగయ్య మృతి కేసులో రంగంలోకి దిగిన జిల్లా పోలీసులు లోతుగా విచారణ చేపట్టారు. ఘటన ప్రదేశంలో డ్రోన్, సీసీ కెమెరాల ఫుటేజీని సేకరించారు. అలాగే జగన్ ర్యాలీని చిత్రీకరించిన ఆరుగురి కార్యకర్తల ఫోన్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. వాటిని ఫోరెన్సిక్ టీమ్‌కు అప్పజెప్పారు. ఫోన్లలో తీసిన వీడియోలు ఫోరెన్సిక్ నిపుణులు చెక్ చేయగా అవన్నీ ఒరిజినల్ అని స్పష్టమైంది. దీంతో ర్యాలీ సమయంలో జగన్ వాహనం కింద పడే సింగయ్య మరణించాడని ఫోరెన్సిక్ అధికారులు ధ్రువీకరించారు. అందుకు సంబంధించిన వీడియోలు ఫేక్ కాదని.. ఒరిజినలే అని తేల్చి చెప్పారు. ఫోరెన్సిక్ రిపోర్టుతో సింగయ్య మృతి కేసు ఏ మలుపు తిరగబోతుంది అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.