ఉమ్మడి అనంతపురం జిల్లా రాప్తాడులో వైసీపీ నాయకుల మధ్య వివాదాలు జోరుగా సాగుతున్నాయి. ఇద్దరూ కీలక నేతలే కావడం.. పైగా సామాజిక వర్గాల పరంగా కూడా సునిశితంగా ఉండడంతో వైసీపీ అధిష్టానం కూడా ఈ విషయంపై మౌనంగా ఉంది. ఎవరినీ ఏమీ అనలేక.. ఎవరితోనూ చర్చించే సాహసం చేయలేక.. మౌనం పాటించింది. విషయంలోకి వెళ్తే.. రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డిని కార్నర్ చేస్తూ… అనంతపురం మాజీ ఎంపీ.. వైసీపీ అధికార ప్రతినిధి, మాజీ సీఐ గోరంట్ల మాధవ్ విమర్శలు చేస్తున్నారు. ఈ ఏడాది ప్రారంభంలో ఆయన ఇచ్చిన విందు సందర్భంగా.. బీసీలను కొందరు అణిచేస్తున్నారని వ్యా ఖ్యానించారు. అంతేకాదు.. ఆ తర్వాత సోషల్ మీడియాలో కూడా.. తోపుదుర్తిని కార్నర్ చేస్తూ.. కామెంట్లు కుమ్మరించారు. ఈ పరిణామాలపై తుపుదుర్తి కూడా సీరియస్ అయ్యారు. `నా నియోజకవర్గంలో ఎవరో వచ్చి రాజకీయాలు చేస్తే.. సహించేది లేదు“ అని ఆయన చెబుతున్నారు. అంతేకాదు.. గత ఎన్నికల్లో గోరంట్ల పనిగట్టుకుని తనను ఓడించే కార్యక్రమాలు చేశారని కూడా ఆయన బహిరంగ వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యల తర్వాత.. గోరంట్ల మాధవ్ మరింత రెచ్చిపోయారు. బీసీలపై జరుగుతున్న దాడులుగా ఆయన పేర్కొంటూ.. బీసీలను ఏకం చేసే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. పైగా రాప్తాడులో తన సామాజిక వర్గానికి చెందిన(కురబ) వారు ఎక్కువగా ఉండడంతో వారిని తనవైపు తిప్పుకొనే ప్రయత్నం ముమ్మరం చేశారు. అంతేకాదు.. రాప్తాడు బాధ్యతలను గోరంట్లకు ఇస్తారంటూ.. ఓ వర్గం నాయకులు కూడా ప్రచారం చేస్తున్నారు. మరోవైపు.. గత ఎన్నికల్లో టికెట్ కోల్పోయిన మాధవ్.. వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీకి పోటీ చేయాలని భావిస్తు న్నారు. ఈ క్రమంలో కురబలు ఎక్కువగా ఉన్న రాప్తాడుపై ఆయన కన్నేశారనేది నిర్వివాదాంశం. ఈ క్రమంలోనే వివాదాలకు ఆయన కేంద్రంగా మారుతున్నారన్న చర్చ సాగుతోంది. అయితే.. ఇంత జరుగుతున్నా.. పార్టీ మాత్రంమౌనంగా ఉంది. అటు తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డిని ఏమైనా అంటే.. రెడ్డి సామాజిక వర్గం దూరమవుతుందన్న ఆవేదన కావొచ్చు.. ఇటు గోరంట్లను అంటే.. బీసీలు బాధపడతారన్న ఆవేదన కావొచ్చు.. మొత్తానికి అధిష్ఠానం మాత్రం మౌనంగానే ఉంది. మరి ఏం చేస్తారో చూడాలి.